భయం వద్దు… ఇలా ‘టెట్ క్రాక్’ చేయండి
ఎట్టకేలకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్.. ‘టెట్’ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 12 నిర్వహించే ఈ పరీక్షకు సుమారు 3 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షకు గానూ ఆన్లైన్ ద్వారా మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులు పంపవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఈ సారి టెట్ సర్టిఫికేట్కు లైఫ్‌టైమ్ వ్యాలిడిటీతో పాటు బీఈడీ చేసిన వారికి పేపర్ –1 రాసే అవకాశం ఇచ్చింది.
టెట్ కేవలం క్వాలిఫై ఎగ్జామ్ కాకుండా డీఎస్సీలోనూ 20 మార్కుల వెయిటేజీ ఇవ్వడంతో టెట్ స్కోర్ కీలకంగా మారనుంది. టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో ఈ సారి నిర్వహించే టెట్‌కు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

ఈ సారి 70 రోజుల ప్రిపరేషన్ టైమ్ ఉంది. ఇదివరకే టెట్ రాసిన అభ్యర్థులకు కొంత అవగాహన ఉన్నా. కొత్తగా రాసేవారు గతంలో నిర్వహించిన టెట్ ప్రశ్నాపత్రాలు, సబ్జెక్టుల వారిగా ప్రశ్నల స్థాయి, ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్న అంశాలు, చివరిలో మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు.150 మార్కులకు కనీసం 110 నుంచి 130 మార్కులు సాధిస్తే డిఎస్సీలో మంచి వెయిటేజీ వస్తుంది.
టెట్ సిలబస్ షీట్‌ను పక్కన పెట్టుకుని ప్రిపరేషన్ ప్రారంభించండి. సిలబస్‌లోని అంశాల థియరీ పార్ట్‌ను కచ్చితంగా చదవాలి. మొదటి 30 రోజులు ప్రిపరేషన్‌కు, తర్వాతి 15 రివిజన్‌కు, తర్వాతి 15 రోజులు ప్రాక్టీస్ కోసం కేటాయించుకుని చదవాలి.
క్వశ్చన్ పేపర్ తయారు చేయటానికి ప్రామాణిక పుస్తకాలనే ఆధారంగా చేసుకుంటారు కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకాలు, డీఈడీ, బీఈడీ సిలబస్, రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించి పాఠ్యపుస్తకాలను ఫాలో అయితే చాలు.
గత టెట్లను పరిశీలిస్తే పెడగాజి నుంచి 8 నుంచి 10 ప్రశ్నలు, అభ్యసనం నుంచి 6 నుంచి 8 ప్రశ్నలు, శిశు వికాసం నుంచి 8 నుంచి 10 ప్రశ్నలు , వైయక్తిక భేదాలు, మూర్తిమత్వం టాపిక్ నుంచి రెండు ప్రశ్నలు అడిగారు. ఈసారి కూడా అదే స్థాయిలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మెథడాలజీలో తరగతి గది, విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠశాల పరిసరాలు వీటి చుట్టే ప్రశ్నలు తిప్పి తిప్పి ఎక్కువగా అడుగుతున్నారు. నిత్యజీవితానికి అన్వయించుకుని జవాబులను గుర్తించవచ్చు.

తెలుగు నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. ఎక్కువగా వ్యాకరణ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కవులు, రచనలు, బిరుదులు వంటి కంటెంట్ అంశాలపై దృష్టి పెట్టాలి. పాఠ్య పుస్తకాల వెనకాల ఉన్న వ్యాకరణ అంశాలను పాఠ్యాంశంలోని విషయాలను అన్వయించుకుని చదవాలి.
పద్యాలు, ప్రతిపదార్థాలు, భావం, అర్థాలు, ప్రకృతి–వికృతి, సొంత వ్యాక్యాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు ఇలా ప్రతి అంశం నుంచి గతంలో నిర్వహించిన టెట్లలో ప్రశ్నలు వచ్చాయి. తెలుగు మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. డీఈడీ, బీఈడీ సిలబస్‌లోని భాషా బోధనలో అనుసరించాల్సిన వ్యూహాలు, బోధనా పద్ధతులు ఇతర అంశాలను చదవాలి.
మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల నుంచి పేపర్– వన్ రాసేవారు 1–8 తరగతుల వరకు, పేపర్ – టూ రాసేవారు 10వ తరగతి వరకు కంటెంట్ చదవాల్సి ఉంటుంది. సిలబస్ దాటి ప్రశ్నలు అడిగే అవకాశమే లేదు. కాబట్టి పాఠ్యపుస్తకాలను లైన్ టు లైన్ చదువుతూ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం చాల బెటర్.
ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. ఇవి డీఈడీ, బీఈడీ సిలబస్ నుంచే అడుగుతారు. చాలా మందికి తెలుగు మీడియంలోనే చదివి ఉండటం వల్ల ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు 2 గంటలు ఇంగ్లీష్ కు తప్పనిసరిగా కేటాయించాలి. గ్రామర్‌పై పట్టు సాధిస్తే 15 మార్కులు ఈజీగా స్కోర్ చేయవచ్చు. తెలియని పదాలను డిక్షనరీ ద్వారా తెలుసుకుంటూ నోట్స్ రాసుకుంటూ, 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో ఉన్న గ్రామర్‌ను ప్రాక్టీస్ చేయాలి. గత ప్రశ్నాపత్రాలను ఒకసారి గమనిస్తే ప్రశ్నలు ఎలా అడుగుతున్నారనేది అర్ధమవుతుంది.