పాత గ్రౌండ్ లో కొత్త ఆట “ఝండ్” (రివ్యూ)
ఇండియన్ సెల్యులాయిడ్ మీద క్రీడా నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయ్. చక్ దే ఇండియా, సాలా ఖడూస్ (తెలుగులో గురు), సుల్తాన్ లాంటి సినిమాలు కోకొల్లలు. అలాంటి కథే అయినా “ఝండ్” ని మాత్రం కాస్త ప్రత్యేకంగానే చూశారు ప్రేక్షకులు. కారణం అమితాబ్ లీడ్ రోల్ అని మాత్రమే కాదు. ఈ సినిమా దర్శకుడు నాగరాజ్ మంజులే. సైరాట్’ అనే మరాఠీ చిత్రంతో ఇతర భాషల వాళ్లు కూడా తనవైపు తిరిగి చూసేలా చేసిన దర్శకుడు నాగ్‌రాజ్ మంజులే. జాతీయ అవార్డు సాధించిన ఈ చిత్రం శ్రీదేవి కుమార్తె కథానాయికగా హిందీలో ‘ధడక్’ బాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అందుకే ఈసారి అమితాబ్ తో మంజులే చిత్రం అని అనౌన్స్ చేయగానే చాలామంది కాస్త ఇంట్రస్ట్ గానే చూశారు. అంతే కాదు మొన్నామధ్య ప్రైవేట్ స్క్రీనింగ్‌లో చూసి కళ్ళకు నీల్లతో ఈ సినిమాని మెచ్చుకున్నాడు అమీర్ ఖాన్ దాంతో సహజంగానే సినిమాకి కావాల్సినంత హైప్ వచ్చింది.

కథ:
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫుట్‌బాల్ కోచ్ గా కనిపిస్తాడు. నిజ జీవితంలో ఫుట్ బాల్ ఆటగాడైన విజయ్ బార్సే నిజ జీవితం ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. నాగ్‌పూర్‌లోని జోపడ్‌పట్టి అనే మురికివాడలో పేదరికంలో మగ్గుతున్న పిల్లలు చైన్ స్నాచింగ్ , బొగ్గు , గంజాయి అమ్మటం లాంటి నేరాలు చేస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. అక్కడ ఉండే మెరికల్లాంటి పిల్లలు అలా నేరాలు చేసి జైల్లలో మగ్గిపోవటాన్ని ఆపాలనుకుంటాడు. స్లమ్ సాకర్ అనే NGO ని స్థాపించిన రిటైర్డ్ స్పోర్ట్స్ టీచర్. విజయ్ ఈ పిల్లలకి ఆశ్రయం ఇచ్చి, ఫుట్ బాల్ శిక్షణ ఇస్తాడు. ఆ ప్రాంతంలో ఉండే సంపన్న వర్గాల పిల్లలు చదివే కాలేజ్‌లో ఆడే ఫుట్‌బాల్ టీమ్‌తో స్లమ్స్‌లో ఉండే పిల్లల టీమ్‌తో పోటీ (జరుగుతుంది. నిజానికి ఇలాంటి పాయింట్ ప్రతీ స్పోర్ట్స్ సినిమాలోనూ సర్వ సాధారణంగా కనిపిస్తూనే ఉంది) ఆ పోటీలో విజయం సాధించిన జట్టుకు ఇంటర్నేషన్ సాకర్ పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. విజయ్ టీమ్ ఆ పోటీలో నెగ్గుతుంది. కానీ, నేర చరిత్ర, సరైన చదువు లేని పిల్లలు కావటం వల్ల వాళ్లకి పాస్‌పోర్ట్ ఇవ్వలేమంటారు అధికారులు. అలాంటి పరిస్థితిలో కోచ్ విజయ్ బార్సే ఏం చేశాడు.ఆ పిల్లలు ఇంటర్నేషనల్ హెమ్ సాకర్ టోర్నమెంట్లో ఎలా అడుగుపెట్టారు ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా స్టోరీ.
అనాలసిస్:
నిజానికి ఝుండ్ కథ దాదాపుగా నిజమైన ఘటనల ఆధారంగానే రూపొందించబడింది. 2012లో అమీర్ ఖాన్ సత్యమేవ జయతే అనే ప్రోగ్రాం చేసినప్పుడు మొదటి అతిథి విజయ్ బర్సే. స్పోర్ట్స్ టీచర్ గా పని చేసి రిటైర్ అయిన తరువాత ‘స్లమ్ సాకర్’ అనే ఎన్ జీవోని స్థాపించించి. చుట్టుపక్కల స్లమ్స్‌లో ఉండే పిల్లలని.. ముఖ్యంగా బాలనేరస్తులను తీసుకువచ్చి , వ్యసనాలకు దూరం చేసి , వారిలో క్రీడాస్ఫూర్తిని నింపి సాకర్ టీమ్ ను తయారు చేశారు.
అదే స్టోరీతో ‘ ఝుండ్ ‘ సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్. స్పోర్ట్స్ అధికారుల ముందు , పోలీస్ స్టేషన్లో , కోర్టులో అమితాబ్ నటన అద్బుతంగా కుదిరింది. నిజానికి ఇలాంటి పాత్రలలో ఉండే ఒకరకమైన యాట్టిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌ని అమితాబ్ చక్కగా పట్టుకోగలిగాడు. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ పాత్రల్లో ఆకాష్ తోసర్ , రింకూ రాజ్‌గురు మంచి నటనతో ఆకట్టుకున్నారు. రింకూ పేదరికంలో ముగ్గుతున్న అమ్మాయిగా.. ఆకాశ్ సంపన్న వర్గానికి చెందిన యువకుడిగా నెగిటివ్ పాత్రలో కనిపించి మెప్పించారు.

ఇప్పటికే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు చాలా వచ్చాయి. పేద, ధనిక వర్గాల పిల్లలమధ్య పోటీ లాంటి సన్నివేశాలు దాదాపుగా ఇలాంటి అన్ని సినిమాల్లోనూ ఉన్నాయి. ఇలాంటి చిత్రాల్లో అయిదు నిమిషాల ముందుగానే తరవాత ఏం జరగబోతోందో ఊహించి చెప్పేయొచ్చు.
అయితే ఈ సినిమాని మిగతా స్పోర్ట్స్ బేస్డ్ కథల్లానో, ఒక ఆటగాడి బయో పిక్ గానో మాత్రమే అని ఒకే గాటన కట్టలేం. ఎందుకంటే ఈ సినిమా ఒక భావజాలాన్ని అనుసరించింది. ఇప్పుడు ఆ వైపు నుంచి ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. సినిమాలోని పాత్రల పేర్ల దగ్గరనుంచి, వాళ్ల మత నేపథ్యాలని కూడా తడిమిన తీరు, అంబేద్కర్ బౌద్ధం తీసుకున్న దీక్షా భూమి ముందు నుండి డాన్ పరుగు తీసే సన్నివేశం లాంటివి ఈ సినిమాని మరో మెట్టు మీద నిలబెట్టాయి. అన్నిటికీ మించి అమితాబ్ పాత్ర కోర్టులో చెప్పే డైలాగులు అక్కడ వచ్చే ఎమోషన్స్ చూసి తీరాల్సిందే. అయితే, నిజానికి సినిమాని మరింత బాగా ట్రై చేయొచ్చు. ఫుట్ బాల్ ఇతివృత్తంతో మనదగ్గర వచ్చిన సినిమాలు తక్కువే. కానీ ఎప్పుడూ ఉండే మూస పద్ధతిలోనే కథ నడవటం, స్పోర్ట్స్ డ్రామాకి కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ అవటం సినిమాని చాలావరకూ తగ్గించేసాయి. రొటీన్ స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోదు. ఆట గురించి ఎంతగానో హైప్ క్రియేట్ చేసినప్పటికీ, దానిని కన్విన్సింగ్ గా తెరమీద చూపించడంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.
టెక్నికల్ వ్యాల్యూస్
సుధాకర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. స్లమ్ ఏరియాను సహజంగా చూపించటం, కెమెరా వర్క్ ఆకట్టుకునేలా ఉంది. కొన్ని సీన్లలో లైటింగ్ వాడుకొన్న తీరు హై రేంజ్లో ఉంటుంది. బిగ్ బి కోసం రాసిన డైలాగ్స్ బాగున్నాయి. సాకేత్ కనెత్కర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , అజయ్ , అతుల్ పాడిన పాటలు సినిమాని కొంతవరకూ ఆదుకున్నాయి. నాగరాజ్ మంజులే డైరెక్షన్ ఇదివరకు చూసినట్టే సహజత్వాన్ని మిస్ అవ్వకూడదన్నట్టుగా తీసుకున్న శ్రద్ద స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలో అట్టడుగు వర్గాల వారి మనసుల్లో నెలకొన్న మనోభావాలను సైతం కథలో అద్భుతంగా చొప్పించాడు దర్శకుడు. ‘జై భీమ్…’ నినాదాలు, బాబా సాహెబ్ అంబేద్కర్ పోస్టర్స్, అజయ్- అతుల్ ప్లే చేసే మ్యూజిక్ నాగరాజ్ స్టాండ్, ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటో చెబుతాయి. అయితే… ఇంత చక్కని బలమైన పాయింట్‌ని క్యాచ్ చేయటంలో చూపించిన పట్టు డైరెక్షన్లో కూడా చూపించి ఉంటే బావుండేది. సినిమా అనుకున్న స్థాయిని అందుకోలేకపోవటంలో దర్శకుడి పాత్ర ఖచ్చితంగా ఉందనే చెప్పాలి.
మొత్తం మీద ఝండ్ ఆకట్టుకునే కథా, బోరెత్తించే కథనం. అద్బుతమైన నటనా, నటుల్ని సరిగ్గా వాడుకోలేకపోయిన లోపం. చక్కటి పాయింట్, పేలవమైన టేకింగ్…. ఇలా అన్నీ కలగలిసిన మామూలు సినిమాగా మారిపోయింది. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వాళ్లకి, ఆఫ్ బీట్ మూవీ లవర్స్‌కి మాత్రం సినిమా నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్:
అమితాబ్ బచ్చన్
సినిమాటోగ్రఫి
ఆర్ట్ వర్క్
మైనస్ పాయింట్స్:
స్లోగా సాగే కొన్ని సన్నివేశాలు
స్పోర్ట్స్ పరంగా థ్రిల్లింగ్ సీన్స్ లేకపోవటం. పేలవమైన స్క్రీన్ ప్లే