ఫారెస్ట్ బాత్ : ఇదొక లేటెస్ట్ ట్రెండ్
‘ఫారెస్ట్ బాత్’ అంటే అడవిలో స్నానం చేయడం కాదు. శరీరాన్ని ప్రకృతిని అనుసంధానించే ప్రక్రియ. దీన్నే జపాన్‌లో షిన్రిన్ యోకు అంటారు. భారతీయులకు ఆయుర్వేదం ఉన్నట్టే జపనీయులకు ఎకో థెరపీ అందుబాటులో ఉంది. దీన్ని జపనీయులు ‘ఫారెస్ట్ బాతింగ్, ఫారెస్ట్ థెరపీ’ అంటారు.

ఇది దాదాపు 150 ఏళ్ల క్రితం నుంచి అంటే, 1854 నుంచే అమల్లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.మన ఇంద్రియాలను అటవీ వాతావరణంతో అనుసంధించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. జపాన్‌లో 1980 నుంచి ఫారెస్ట్ బాత్కు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. అడవిలో చెమటలు కక్కేలా నడవడం, పరిగెత్తడం ఈ ప్రక్రియలో భాగం. అంతేగాక, కళ్ల ద్వారా పచ్చని చెట్లని చూడటం, స్వచ్ఛమైన వాసనలను పీల్చడం.
పక్షుల కిలకిలలు, చిన్న చిన్న శబ్దాలు, గాలి హోరును చెవులతో వినడం.. ఇలా ప్రతి ఒక్కటీ ఆస్వాదించడమే ఫారెస్ట్ బాత్. చెట్ల మధ్య నుంచి వచ్చే గాలిలో కాలుష్యం లేకపోవడమే కాకుండా ‘పైటోన్‌సైడ్’ అనే రసాయన మిశ్రమం ఉంటుంది. బ్యాక్టీరియా, క్రిములు దగ్గరికి రాకుండా తమను తాము రక్షించుకునేందుకు చెట్లు పైటోన్సైడ్ను విడుదల చేస్తాయి. దాన్ని మనుషులు పీల్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఒత్తిడి కలిగించే హార్మోన్ల విడుదల ఆగి పోతుంది.

చెట్లు ఆక్సిజన్‌ను మాత్రమే కాకుండా ఎన్నో అత్యవసర తైలాలను విడుదల చేస్తాయని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ అధ్యయనం తెలిపింది. మొత్తానికి ‘ఫారెస్ట్ బాత్’ అలవాటు చేసుకొంటే .. ఒత్తిడి నుంచి విముక్తి, మానసిక ఆనందం రెండూ సొంతం చేసుకోవచ్చు.
మానవ శరీరంలోని కణాలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు ఆ బ్యాక్టీరియాను చంపేసేందుకు కొన్ని కణాలు పోరాటం చేస్తాయి. వాటిని ‘నేచురల్ కిల్లర్స్’ అని కూడా వ్యవహరిస్తారు. అడవికి బయట ఉన్నప్పుటి కంటే మనుషులు అడవిలో ఉన్నప్పుడు వారిలోని నేచురల్ కిల్లర్స్ క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు కూడా పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్ లాంటి ట్యూమర్లు ఏర్పడకుండా కూడా ఈ సెల్స్ పనిచేస్తాయి.

ఈ ఫారెస్ట్ బేతింగ్ను జపాన్ ప్రభుత్వం 1982 నుంచి తమ ‘జాతీయ ప్రభుత్వ వైద్య కార్యక్రమం’లో భాగం చేసింది. చెట్లకు, మనుషుల ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటో ఇంతకాలానికి పరిశోధకులు కనుగొనగలిగారు. చెట్టును కౌగిలించుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకునే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది.
అడవిలో మెల్లగా నడుస్తూ ప్రకృతి నుంచి వచ్చే గాలి పీల్చడం, చెట్లను హగ్ చేసుకోవడమే ఈ ఫారెస్ట్ బాతింగ్. ఇలా నడిస్తే ఎన్నో శారీరక ,మానసిక సమస్యలు దూరం అవుతాయి. కోపం, ఆందోళన, ఒత్తిడి, అలసట వంటి వాటికీ ఫారెస్ట్ బాతింగ్ చక్కని పరిష్కారం.

దీనికోసం పచ్చని అడవి ఎంచుకోవాలి, అప్పుడప్పుడు పిక్నిక్ లాగ అడవిలో విహారానికి వెళ్లి, చెట్లను హగ్ చేసుకుంటే.. ప్రకృతి మన సమస్యలను హీల్ చేస్తుంది. ఇప్పుడు ఫారెస్ట్ థెరపీ స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా విస్తరించింది. ఇప్పుడక్కడ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫారెస్ట్ బాతింగ్ గైడ్లు కూడా ఉన్నారు. కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్న ప్రజలు వారాంతంలో ఆరోగ్యం కోసం అడవుల దారులు పట్టడం మంచిది. దగ్గరలో మంచి ప్లేస్ ఏముందో వెతకండి మరి…
