ఎండలు మండుతున్నాయ్… చర్మం జాగ్రత్త
ఎండాకాలం వచ్చేసిందంటే…ముఖం జిడ్డుగా మారిపోతూ ఉంటుంది. జుట్టైతే ఎండకి పొరిబాడిపోయి..హెయిర్‌ఫాల్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఏవేవో చేయాలనుకుంటాం! ఎన్ని క్రిములు రాసినా ఎదో అసంతృప్తితో ఉంటాం. మనం కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే వీటినుంచి కాస్తా ఉపశమనం పొందొచ్చు.
నిజానికి ఏ సీజన్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు స్కిన్ ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అందులోనూ చెమట ఎక్కువగా వచ్చి, చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉన్న ఎండాకాలంలోనే ఎక్కువ జాగ్రత్త అవసరం. లోషన్లూ, క్రీములూ అంటూ అనవసర ఖర్చు చేయాల్సిన అవసరం లేదనుకుంటే ఈ సింపుల్ చిట్కాలతో ఎండాకాలం కూడా స్కిన్ ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.
వాసిలేన్, మాయిశ్చరైజర్ అంటూ చలికాలం బాగానే హడావుడి చేస్తాం కానీ ఎండాకలంలో మాత్రం పెద్దగా ఆ శ్రద్ద ఉండదు. మాయిశ్చరైజర్ వాడే వాళ్లలో 2% కూడా సన్ స్క్రీన్ లోషన్ మాత్రం వాడరు.

ఈ కాలంలో నీళ్లు ఎక్కువ తాగటం వల్ల శరీరం చల్లబడుతుంది. వ్యర్థాలు, ట్యాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా సహజంగానే చర్మం తాజాగా, తేమగా కనిపిస్తుంది. అయితే మరీ తాగిటే మంచిది కదా అని విపరీతంగా నీళ్లు తాగటం కూడా ప్రమాదమే రోజుకి 4-6 లీటర్లకు మించకుండా తాగాలి.
ఎండ తీవ్రత మొదట చర్మంపైనే పడుతుంది. ముఖం, మెడ, చేతులు, కాళ్లు..ఇలా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే భాగాలన్నీ ట్యాన్‌కు గురవుతాయి. అలా కాకూడదంటే ఎండలోకి వెళ్లినా వెళ్లకపోయినా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఎండలోకి వెళ్లే పావు గంట ముందే లోషన్ రాయాలి.

ఎండాకాలమే కదా ఇప్పుడు మాయిశ్చరైజర్ తో ఏం పని అనుకోవద్దు. మాయిశ్చరైజర్ రాసుకోవడం మానొద్దు. అప్పుడే స్కిన్ లో గ్లో తగ్గకుండా ఉంటుంది.
ఎండలోనుంచి బయటికి రాగానే చల్లని క్లాత్ తో చర్మాన్ని తుడుచుకోవాలి. లేదా ఐస్ ముక్కలతో మర్దనా చేసుకోవాలి. చర్మం నల్లబడడం, కమిలిపోవడం తగ్గుతుంది.
ఈ సీజన్లో 30 శాతం కళ్ల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఎండల్లో ఎక్కువసేపు ఉంటే కళ్లు ఎరుపు రంగులోకి మారుతాయి. ఒక్కోసారి కనురెప్పలపై వాపు వస్తుంది. ఇవన్నీ ఎండలు, తీవ్రమైన వేడి వల్లే వస్తాయి. ఎండలోంచి ఇంటికి వచ్చాక చల్లని నీళ్లలో ముంచిన దూది లేదా కీరా ముక్కలను కళ్లపై పెట్టాలి. ఇలా చేస్తే కళ్లు అలసిపోకుండా ఉంటాయి. పైగా కళ్లలో ఉండే ఎరుపు రంగు తగ్గుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వాడటం మంచిది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలను సాయంత్రానికి వాయిదా వేసుకోవాలి.
చర్మం కమిలినట్టు అయినా, ఎర్రగా మారిన కలబంద జెల్‌ను రాసుకోవాలి. అలాగే పుదీనా నూనె, కొబ్బరి నూనె రాస్తే చర్మం మంట త్వరగా తగ్గుతుంది. యాంటీ బ్యాక్టిరియల్ గుణాలున్న యాపిల్ సిడర్ వెనిగర్ రాసుకున్నా మంచిదే.

తక్కువ గాఢత ఉన్న సబ్బులనే ఉపయోగించాలి. యాంటీ బ్యాక్టిరియల్ గుణాలున్న సబ్బును వాడితే మంచిది. చర్మం దురద పెట్టడం తగ్గుతుంది.
వేసవి వేడిలో ముఖానికి నూనె లేదా సీరమ్ ఉపయోగించడం ఎంతమాత్రం మంచిది కాదు. వేసవి కారణంగా చెమట, జిడ్డు ఎక్కువగా ఉంటుంది. నూనె వంటివి రాస్తే స్కిన్ మరింత జిడ్డుగా మారుతుంది.