అడవే అతని ఆస్తి
ఒక చెట్టు పెంచటం అంటే ఓ మొక్క నాటి దానికి నీళ్లు పోయటం మాత్రమే కాదు. ఒక పాపని సాకినంత శ్రద్ద తీసుకోవాలి. మొక్క చెట్టుగా ఎదిగే వరకూ దాన్ని జాగ్రత్తగా కాపాడు కోవాలి. అదే ఒక అడవినే పెంచాలి అంటే ఎంత ఓపిక కావాలి. అసలు ’అడవిని పెంచటం‘ అనే మాటే మనకు విచిత్రంగా అనిపిస్తుంది. కానీ, అతను నిజంగానే ఒక అడవిని సృష్టించాడు.
ఆస్థిగా ఎవరైనా ఇళ్ళనో, పొలాలనో చూపిస్తారు. కానీ, మొహమ్మద్ మాత్రం ఇది నా ఆస్తి అంటూ అడవిని చూపిస్తాడు. కేరళలోని కోజికోడ్ దగ్గరలో మూడెకరాల్లో ఇరవై సంవత్సరాల పాటు కష్టపడి అడవిని పెంచాడు మొహమ్మద్. ఇప్పుడు అదే అడవిలో ఉంటూ తన దగ్గరికి వచ్చే వాళ్లకి ప్రతీ చెట్టు గురించి పేరు పేరునా చెబుతూ తిరుగుతూంటాడు. ఆ అడవిలోనే అతని నివాసం. ఇంతకీ ఈ అడవిని పెంచాలనే ఆలోచన నీకెలా వచ్చిందీ అని ఎవరైనా అడిగితే మొహమ్మద్ మహా సంబర పడతాడు. ఆ అడవిని తానెందుకు పెంచాడో ఓ కథలాగా చెబుతాడు.

చిన్నప్పుడు చదివిన కథల్లో ఎక్కువగా అడవుల గురించే ఉండేది. చెట్లన్నా, అడవి అన్నా ఇష్టం అలా ఏర్పడింది. ఎవరైనా చెట్టుని కొడితే బాధగా ఉండేది. అలా చెట్టు కొట్టటాన్ని ఆపలేకపోతున్నందుకే ఎప్పటికైనా అడవిని తయారు చేయాలని అనుకున్నాడట. పెద్దయిన తర్వత ఆ కలని ఇలా నిజం చేసుకున్నాడు.
కేరళలో చాలామంది లాగానే తానూ వయసు రాగానే సౌదీ అరేబియా వెళ్లాడు. 1984లో భార్యా పిలలతో, సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బుతో తిరిగి మళ్ళీ కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఉన్న సొంత ఊరు కొడువల్లి వచ్చేశాడు. సౌదీ డబ్బులతో అక్కడే ఓ జ్యూయెలరీ షాప్ పెట్టుకొని బతుకుతున్నా లోపల లోపల మాత్రం అదవిని పెంచాలనే ఆలోచన మాత్రం పోలేదు. అలా 1999 వరకూ ఆ ఆలోచనతోనే గడిచిపోయింది. కొడుకు ఎదిగాడు. షాపు రన్ అవుతోంది ఇంకా ఏం కావాలి? ఇప్పుడు కల నెరవేర్చుకునే పనిలో పడిపోయాడు. తనదగ్గర ఉన్న అరెకరం పొలం పక్కనే మరో రెండున్నర ఎకరాలు కొన్నాడు. ఆ భూమిలో వ్యవసాయం చేస్తాడేమో అనుకున్నారట ఇంట్లోవాళ్లు. కానీ మొక్కలు తెచ్చి నాటుతూంటే ఇతనికి పిచ్చెక్కిందా? అనేవాళ్లట ఇంట్లోవాళ్లతో పాటు చుట్టుపక్కల వాళ్లు కూడా. అలా అనుకోవటానికీ ఓ కారణం ఉంది మొదట్లో అక్కడ నీళ్ల సదుపాయం ఉండకపోవటంతో దగ్గరలో ఉన్న బంధువు ఇంటిదగ్గరనుంచి బళ్ల మీద డ్రమ్ములతో నీళ్లుతీసుకువెళ్లి మరీ రెండు పూటలా ప్రతీ మొక్కకీ పోసేవాడట. టేకు, ఎర్రచందనం లాంటి ఒకే రకం మొక్కలైనా వ్యాపారం కోసం అనుకోవచ్చు కానీ అన్నీ ఒక్కొక్క రకం మొక్కలు. అసలు మొహమ్మద్ ఏం చేస్తున్నాడో చుట్టుపక్కల వాళ్లకి అర్థం కాక అతన్ని ఓ పిచ్చివాడిగా జమకట్టేశారు.
అలా ఒకటీ రెండు కాదు ఇరవయ్యేళ్ల పాటు మొక్కలని నాటు తూనే ఉన్నాడు, నాటిన మొక్కలని కాపాడుకుంటూనే ఉన్నాడు. ఆ మూడెకరాల అడవిలో భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని అన్ని చోట్లా పెరిగే చాలా రకాల చెట్లని పెంచాడు. ఆ అడవిలోని ప్రతీ చెట్టూ అతని చేతులతో తెచ్చుకుని నాటిన మొక్కలే. అందుకే ఆ మూడు ఎకరాల్లో ఉన్న ప్రతీ చెట్టు గురించీ మొహమ్మద్‌కి పూర్తిగా తెలుసు. ఆ చెట్టు ఏజాతికి చెందింది, దాని బొటానికల్ నేమ్, అది నేచర్‌కి ఎలా సాయపడుతుందీ ఇలా ప్రతీ చెట్టు గురించీ అతనికి తెలుసు. ఈ విషయాలన్నీ అతని అడవిని చూడటానికి వచ్చే స్టూడెన్ట్స్కి చెబుతూ ఉంటాడు.

ఈ అడవిలో గుల్ మొహర్ దగ్గరనుంచి, చెస్ట్ నట్ చెట్టువరకూ. రకరకాల మొక్కలు కనిపిస్తాయి. ఇవన్నీ అతను చదివి పుస్తకాల్లో ఉన్న చెట్లే. గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ నవలలోని చెస్ట్ నట్, ఖలీల్ జీబ్రాన్ రచనల్లో చదివిన గుల్ మొహర్ ఇలా తను చదివిన పుస్తకాల్లో తనకు నచ్చిన ప్రతీ మొక్కనీ ఎక్కడెక్కడినుంచో తెప్పించుకొని మరీ ఆ అడవిని పెంచుకున్నాడు. టేకు, మహౌగని, వేప, సర్పగంధ ఇలా 250కి పైగా రకాల చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టుకీ దాని గురించి రాసిన లేబుళ్లు అతికించి ఉంటాయి. రకరకాల పక్షులు ఆ చెట్ల మీద గూళ్లు కట్టుకుని ఉంటాయి. వచ్చిన వాళ్లంతా ఆ అడవిలో ప్రశాంతంగా తిరుగుతూందటమే మహమ్మద్‌కి ఆనందం
ఇప్పుడు ఆ అడవి ఒక టూరిస్ట్ స్పాట్. స్కూల్ స్టూడెంట్స్ నుంచీ బోటనీ ఫ్రొఫెసర్ల వరకూ మొహమ్మద్ పెంచిన అడవికి వస్తూ ఉంటారు. ఒక్కొసారి అడవికి వచ్చేవాళ్ల సంఖ్య 100-150 వరకూ ఉంటుందట. ఆ అడవిలోనే తిరుగుతూ పిల్లలకీ, ఫ్రొఫెసర్లకీ, రీసెర్చ్ కోసం వచ్చేవాళ్లకీ అడిగిన వివరాలని చెబుతూ ఉంటాడు మొహమ్మద్. వారికి ప్రతి చెట్టునూ, మొక్కనూ చూపించి.. వాటి ప్రత్యేకతలనీ వివరించి చెప్పటం ముహమ్మద్ ద్యూటీ.
ఈ అడవిలోకి వెళ్లటానికి నాలుగు ఎంట్రన్స్‌లు ఉన్నాయి. ప్రతీ ఎంట్రన్స్ గేట్కీ ఒక పేరు. ఆ పేర్లు కూడా తాను చదివిన రచయితలూ, కథల పేర్లతోనే ఉంటాయి. షేక్స్పియర్ గేట్, ది షెర్లాక్ హోమ్ గేట్, పథేర్ పాంచాలి గేట్. నాలుగోది మాత్రం ఏ రచయిత పేరూ కాదు ఆయన అడవిని పెంచటానికి అన్ని రకాలుగా వెన్నంటి ఉన్న తన భార్య పేరు మీద “లైలా గేట్” అని పెట్టాడు.
.
అయితే ఈ ఆనందం మొహమ్మద్ కి మాత్రమే కాదు. అతని అడవి అక్కడి వాతావరణాన్నే మార్చేసింది. ఒక్క చెట్టు పెంచితేనే ఎంతో ఉపయోగం. మరి మూడెకరాల్లో ఉన్న వందలాది చెట్లవల్ల అక్కడ ఉపయోగం లేకుండా ఎలా ఉంటుందీ!?. ఈ అడవికి కొద్ది దూరంలో కొడువల్లి పంచాయతీలోనే అరాంబ్రా అనే విలేజ్ ఉంది. అదంతా మెరక ప్రాంతం కావటం వల్ల నీళ్ల సమస్య ఎప్పటినుంచో ఉంది. బావులు లోతుగా తవ్వాల్సి వచ్చేది. అడవివిని పెంచటానికి కూడా వేరే ప్రాంతం నుంచి నీళ్లని తెచ్చి మరీ అన్ని చెట్లని పెంచటం వల్ల ఇప్పుడు అక్కడ గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది. అరాంబా విలేజ్ లో ఇప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు. బావుల్లో నీళ్లు కూడా పెరిగాయట.

ఇప్పుడు మొహమ్మద్ ఆస్థి ఈ అడవే. పిల్లలంతా డబ్బు సంపాదన కోసం విదేశాలకు వెళ్ళిపోతే ఈ భార్యాభర్తలిద్దరూ అడవిని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయారు. “రోజురోజుకూ పెరుగుతున్న పొల్యూషన్ వల్ల. నేచర్ దెబ్బతింటోంది, బయో డైవర్సిటీ తగ్గిపోతోంది. ఈ భూమి మీద ఉన్న అన్నిటినీ కాపాడుకుంటేనే మనం కూడా ఆనందంగా ఉండగలం. అడవిని చూడటానికి వచ్చే స్టూడెంట్స్ తో ఇదే చెబుతాను. వాళ్లలో చెట్ల మీద ఉండే ప్రేమ నాకు సంతోషాన్ని ఇస్తుంది, వాళ్లూ “ఇంటికి వెళ్లాక మీలాగే మొక్కలు పెంచుతాం” అన్నప్పుడల్లా గర్వంగా, సంతోషంగా అనిపిస్తుంది. ఈ భూమినీ, చెట్లనో కాపాడుకోవాల్సింది వాళ్లే కదా” అంటాడు మొహమ్మద్. ఆయన చేసిన ఈ అద్బుతానికి చాలా అవార్డులే వచ్చాయి. యూనివర్సిటీల నుంచి కూడా అప్రిషియేషన్స్ వచ్చాయి. అయినా ఇవన్నిటికంటే తన అడవిలో ఒక్కొక్క చెట్టునీ చూస్తూ తిరగటం లోనే ఎక్కువ ఆనందం ఉందని చెబుతుంటాడు మొహమ్మద్.
నిజమే! అడవిని చూడటమే ఆనందాన్ని ఇస్తే, ఏకంగా అడవినే పెంచటం ఇంకెంత ఆనందాన్ని ఇస్తుందీ. ఓ మొక్క నాటి చూస్తే గానీ మొహమ్మద్ పడే సంతోషం మనకూ అందదేమో.