కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?

“పెంపుడు కుక్కను ఒళ్లో కూర్చోబెట్టుకుంటాం..
కానీ సాటిమనిషిని ముట్టుకుంటే మైలపడిపోతాం. ఎంత సిగ్గుచేటు?”
-భగత్‌సింగ్
భారతదేశ స్వాతంత్ర్యం కోసం. 23 ఏళ్ల చిరుప్రాయంలోనే. ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్ నేటికీ ఎందరికో ఆదర్శం అనడంలో సందేహం లేదు.
భగత్‌సింగ్ ముఖ్యంగా భారత స్వాతంత్ర్యోద్యమం, సోషలిజం-విప్లవం, ప్రపంచ రాజకీయాలు, మతం, నాస్తికత్వం, కార్మికోద్యమాలు వంటి అంశాలపై రచనలు చేశారన్నది అందరికి తెలిసిందే, కాని అంటరానితనం గురించి ఆయన భావాలేమిటో చాలామందికి తెలియదు
అప్పటి ఉమ్మడి పంజాబ్ నుంచి ‘కిర్తీ’ అనే పత్రిక వెలువడేది ఆ పత్రికలో ‘విద్రోహి’ (తిరుగుబాటుదారు) అనే కలంపేరుతో భగత్ సింగ్ ఒక వ్యాసం రాశారు. “మన దేశంలో ఉన్నంత దుర్భర పరిస్థితులు మరే దేశంలోనూ లేవు” అంటూ భగత్ సింగ్ మోదలుపెడతారు వ్యాసాన్ని.
“ఇక్కడ చిత్రవిచిత్రమైన సమస్యలున్నాయి. వీటిలో ముఖ్యమైంది అంటరానితనం.
సమస్యేంటంటే, 30 కోట్ల జనాభా (తొంభై యేళ్ళ క్రితం) ఉన్న దేశంలో
6 కోట్ల మందిని అస్పృశ్యులుగా పరిగణిస్తున్నారు.
వారిని ముట్టుకుంటే చాలు పాపం జరిగిపోతుందని చెబుతారు.
వాళ్లు గుడిలో అడుగుపెడితే దేవుళ్లకు కోపం వస్తుందంటారు.
వారు బావి నుంచి నీటిని తోడితే బావి అపవిత్రమై పోతుందంటారు.
ఇరవై శతాబ్దంలో కూడా ఈ సమస్య ఇలా కొనసాగుతోందంటే వినడానికే సిగ్గుగా ఉంది”
అని భగత్‌సింగ్ వ్యాసంలో వ్రాస్తారు.
ఈ వ్యాసం అచ్చయ్యే నాటికి భగత్‌సింగ్ వయసు కేవలం 20 ఏళ్లే.
పునర్జన్మ సిద్ధాంతం
మనుషులందరూ సమానమేననీ, పుట్టుక వల్ల గానీ పని విభజన వల్ల గానీ ఎవరూ ఎక్కువ లేదా తక్కువ కారని భగత్‌సింగ్ అభిప్రాయపడ్డారు.
అంటరానివారి పట్ల అనుసరిస్తున్న అన్యాయమైన, అమానవీయమైన పద్ధతులతో విసిగి వారెక్కడ తిరుగుబాటుకు పూనుకుంటారోనన్న భయంతోనే పునర్జన్మ సిద్ధాంతాన్ని తెచ్చారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

భగత్‌సింగ్ తన వ్యాసంలో “మలాన్ని శుభ్రం చేసినంత మాత్రాన మనుషులు అంటరానివాళ్లెట్లా అవుతారని” గట్టిగా ప్రశ్నిస్తారు.