ఇకిగాయ్ జపనీస్ స్టైల్ ఆఫ్ లివింగ్ 
ఆర్ట్ ఆఫ్ లివింగ్…. బతకటం కూడా ఒక కళ అందుకే జీవితమో నాటక రంగం అనే పదం పుట్టి ఉంటుంది. జపాన్ వాళ్ళు పని రాక్షసులు అనే మాట చాలా సార్లు వినే ఉంటాం. అంతే కాదు అతి ఎక్కువ ఆయుస్సు ఉన్నవాళ్లు కూడా జపాన్ లో ఎక్కువగా ఉంటారు. అయితే జపనీస్ పాటించే లైఫ్ స్టైల్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతోంది. “ఇకిగాయ్”పై ఇప్పుడు చాలామంది దృష్టి పెడుతున్నారు. ఇంతకీ ఈ ఇకిగాయ్ అంటే ఏమిటి?
జపాన్ ఎక్కువ పని చేసే వాళ్లు ఉండే దేశం అనే మాట చాలా సార్లు విని ఉంటాం. అంతే కాదు అక్కడ లేట్ నైట్ క్లబ్స్ కూడా ఎక్కువే. యువకులే కాదు వయసు మీద పడ్డవాళ్లు కూడా ఖాళీగా ఉండేవాళ్లు తక్కువే. నిజానికి పని చేయటం అనేది కూడా ఒక రకమైన అడిక్షన్ లాంటిదే. 70,80 ఏళ్ళు వచ్చినా టాక్సీ నడుపుతూ, షాప్స్ రన్ చేస్తున్న మనుషులు కనిపిస్తారు. ఎక్కువ వర్కింగ్ అవర్స్ వల్ల అలసిపోయి ఇంటికి కూడా వెళ్లకుండా రైల్వే స్టేషన్స్ లో, రెస్టారెంట్స్ లో, పార్కుల్లో చిన్న కునుకు తీసేవాళ్లు ఎక్కువగానే కనిపిస్తారు, మరి ఇలా ఉంటే స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ తగ్గిపోవాలి. కానీ, జపనీస్ స్టైల్ ఆఫ్ లివింగ్ వీటిని బ్యాలెన్స్ చేస్తోంది. కంప్యూటర్ మీద 14 గంటలు పని చేసిన తర్వాత కూడ యాక్టివ్ గా ఉండటం అక్కడ మామూలే. అందుకే సెకెండ్ వరల్డ్ వార్ లో రెండు ముఖ్యమైన పట్టణాలను పోగొట్టుకున్నా కేవలం అరవయ్యేళ్లలో మళ్ళీ నిలబడింది. జపాన్ సిటిజెన్స్ జీవిత కాలం పెరిగింది. ఆర్థికంగా ఇతర దేశాలకు సాయం అందించే స్థితికి చేరుకుంది. దీనికి కారణాల్లో ఇకిగాయ్ ఒకటి అని చెబుతారు వాళ్లు.

ఇకిగాయ్ అంటే?
జపాన్లోని ఒకినావా ద్వీపానికి చెందిన వారి ఆరోగ్య సూత్రం ఇదే అంటూ ‘ఇకిగాయ్’ మీద ఒక పుస్తకం వచ్చింది ఇక్కడి మనుషులు సగటున 80 ఏళ్లకు పైబడి జీవిస్తారు, వందేళ్లకు పైబడి వయసున్న వాళ్లు ఎక్కువగా ఉన్న ప్లేస్ ఇదేనట. వాళ్ల ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ ని ఉల్లాసంగా గడిపే విధానం. ఇవన్నీ ఒకినావా దీవిని స్పెషల్ గా నిలబెట్టాయి. అక్కడి స్థానిక భాషలో ఇకిగాయ్ అంటే జీవితాన్ని గొప్పగా మార్చుకో అని అర్థం.
చేస్తున్న పని, మన లైఫ్ స్టైల్ తో పాటు మన పార్ట్నర్, మన కుటుంబం ఇలా ఏదీ బోర్ అనిపించనంతగా ప్రేమించటమే ఇకిగాయ్. మొత్తంగా ఈ పద్దతి జీవితంలోని ప్రతీ విషయాన్ని చాలా ఇష్టంగా ప్రేమించమని చెబుతుంది. చేస్తున్న పని సంతోషంగా, సంతృప్తితో ఉంటే అది ఇకిగాయ్. దీన్నే చిన్న మార్పులతో ఇట్టైకాన్అనికూడా అంటారు.

నట్సుమే సొసెకీ ఎవరు?
ఇకిగాయ్ అనే పదం 14వ శతాబ్దం నుంచే జపాన్ లో ఉన్నా.. ప్రపంచానికి తెలిసింది మాత్రం 1912లో నట్సుమే సొసెకీ నవల “కొరొకో” వల్ల తెలిసింది. కొరొకో అంటే “మూలం” అని అర్థం. ఓ ముసలి గురువు దగ్గర తన జీవితాన్ని తెలుసుకున్న ఒక బాలుడి కథే ఈ కొరోకో నవల. జపాన్ రాచరిక వ్యవస్థ నుంచి ఇండస్ట్రియలైజేషన్ వైపు నడుస్తున్న టైంలో వచ్చిన ఈ నవల. అక్కడి ప్రజల్లో చాలా ప్రభావం చూపించింది. పనిని ప్రేమించటం, జీవితం లో సంతోషంగా ఉండటం ఇవే ముఖ్యమైన విషయాలు అంటూ చెప్పిన ఫిలాసఫీ అక్కడి ప్రొడక్టివిటీని పెంచింది. పనిలో పడిపోవటం వల్ల అలసిపోతున్నాం అనే ఫీలింగ్ రాకుండా లైఫ్ మీద ఇష్టాన్ని కూడా పెంచింది. ఒక దేశం నిలబడాలంటే ప్రొడక్టివిటీ పెరగటంతో పాటు దేశ పౌరులు మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉండటం ఎలాగో ఈ నవల నేర్పించింది. అందుకే ఇప్పుడు ఈ కొరోకో చెప్పిన ఇకిగాయ్ ఫిలాసఫీ మీద ప్రపంచం లోని పెద్ద యూనివర్సిటీలు రీసెర్చ్ చేస్తున్నాయి.

రిటైర్ మెంట్ అనే మాటే ఉందదు
ప్రపంచంలో ఎన్ని కష్టాలున్నా బతికి తీరాలనే బలమైన కోరిక ఉన్నవాళ్లే ఎక్కువ కాలం బతుకుతారు. రిటైర్ మెంట్ అంటే నేను అలసిపోయాను పని చేయలేను అని చెప్పుకోవటమే. అందుకే ఒకినావా ప్రజలలో రిటైర్ మెంట్ అనే మాటే లేదు. పనికి వయసుతో సంబంధం లేదు అనే వాళ్ళు నమ్ముతారు.మనకు ఇష్టమైన పనినో, అలవాటునో దూరం చేసుకోవడం అంటే చనిపోవటానికి రెడీ అన్నట్టే అని వాళ్ళ నమ్మకం. అందుకే మీకు నచ్చిన పనినే చెయ్యమనటం ఒకినావా ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పని చేయటం అంటే నేను బతికి ఉన్నాను అని చెప్పుకోవటంగా భావిస్తారు వాళ్లు.
అవసరానికన్నా తక్కువే తినాలి..
వసరమైన దానికన్నా ఎక్కువ పని చేయటం, అవసరం అనిపించే దానికన్నా తక్కువ తినటం అనే సూత్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. తక్కువ తినటం అంటే కడుపు మాడ్చుకోమని మాత్రం అర్థం చేసుకోవద్దు. ఎంత రుచికరమైన ఫుడ్ అయినా 20 శాతం కడుపును ఖాళీగా ఉంచుకోమని ఇకిగాయ్ జీవన విధానం చెబుతుంది. ఇంకా కొంచం తినొచ్చు అనిపించినప్పుడే తినటం ఆపేయాలి. దీనికోసం వాళ్ళు ఒక వింత పద్దతిని పాటిస్తారు. అదే వాళ్లు వాడే ప్లేట్స్ కూడా చిన్నగా ఉంచుకోవటం. పెద్ద ప్లేట్ అయితే ఎక్కువగా తినేస్తాం అని. ఒకినవా జాతి ప్రజలు రోజుకు 800 కెలోరీలు దాటనివ్వరు. అదే అమెరికాలో ఈ లెక్క 3,300 కెలోరీల వరకూ ఉంటుంది.
సన్నిహితులతో గడపండి
ఇష్టమైన మనుషులతో గడిపే టైం ఒత్తిడిని దూరం చేస్తుంది. జీవితం మీద ఇష్టం పెంచుతుంది, అందుకే ఇకిగాయ్ కుటుంబంతోనూ, మిత్రులతోనూ ఎక్కువ టైం గడపమంటుంది. మన చుట్టూ మనకు ఇష్టమైన మనుషులు ఉంటే అన్నీ ఉన్నట్టే. నేచర్ కి దగ్గరగా వీలనంత ఎక్కువ సేపు గడపాలి. అందుకే జపాన్ప్రజలు మన లాగా ప్రతి పనికి టూ వీలర్తీయరు. నడకను ఎక్కువగా ప్రేమిస్తారు. దానివల్ల రోజూ నడిచే రోడ్లని శుభ్రంగా ఉంచాలనుకుంటారు. చెత్త ఎక్కడ ఉండే అవకాశం ఉందో గమనిస్తారు. నడవటం వల్ల, అలా గమనించటం వల్ల మన చుట్టూ ఉండే ప్లేస్ మీద ఇష్టం కలుగుతుంది. ఆ తర్వాత దాన్ని చెత్త వేసి పాడు చేయాలి అనిపించదు. ఇంకా అందంగా తయారు చేసుకోవాలి అనిపిస్తుందీ అన్నది వాళ్లు చెప్పే మాట.

ఎంత పని చేస్తే అంత గౌరవం… ఇకిగాయ్ విధానంలో పని మీద ఇష్టం పెంచటానికి ఒక మార్గం ఉంది. ఆ పని మన సొంత సంస్థ అని బలంగా నమ్మాలి. అదే పని మన ఇంటికోసమే చేస్తున్నాం అనుకోవాలి. పనిలో మనకు మనమే సొంతగా టాస్క్ లు నిర్ణయించుకుంటూ ఉత్సాహంగా పని చేసుకుపోవాలి. ఇలా ఉండకపోతే అక్కడ మనం అబ్ నార్మల్ గా ఉన్నట్టే. ఇలా క్వాలిటీ ఆఫ్ వర్క్ ని పెంచే ఈ పద్దతి అందరికీ నచ్చింది. ఇంటిపని చేసే హౌస్ వైఫ్స్ దగ్గరనుంచీ కళాకారుల వరకూ ఎవరు ఏ పని చేసినా దానిలో పూర్తిగా మునిగి పోవాలి అనుకునే ఆలొచన పెరిగి పోయింది. అందుకే ఇప్పటికీ జపాన్ లో ఎక్కువ గంటలు పని చేసేవాళ్లలకి రెస్పెక్ట్ ఎక్కువ. అక్కడ ట్యాక్సీ డ్రైవర్ అయినా రోడ్లు క్లీన్ చేసే శానిటేషన్ వర్కర్ అయినా రెస్పెక్ట్ మారదు. ఎందుకంటే మనతో సమానంగా ఉండే అన్నిటినీ ప్రేమించటం, గౌరవించటం,హెల్ప్ చేయటం కూడా ఇకిగాయ్ లో భాగమే. ఇదీ ఇకిగాయ్. అందుకే ఇప్పుడు ఇకిగాయ్ ఫిలాసఫీ మీద ఎక్కువ ఇంట్రస్ట్ పెరుగుతోంది.