మెటావర్స్ అంటే ఏమిటి?
మెటావర్స్ అంటే ఏమిటి?: ఈ వర్చువల్ ప్రపంచం మనల్ని శాసించబోతోందా?
ఇప్పుడు ప్రపంచంలోనే క్రేజీవర్డ్ ఏమిటో తెలుసా? మెటావర్స్. ఇప్పుడు తరచూ ఈ పదాన్ని వింటున్న మనం కొద్ది సంవత్సరాలలో ఆ ప్రపంచంతో అనుసంధానం కాబోతున్నాం. వాస్తవానికి ‘మెటావర్స్’ అనేది ఒక పారలల్ ప్రపంచం. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడున్న ఫేస్బుక్ కన్నా వందరెట్లు రియాలిటీగా కనిపించే కొత్త లోకం అది. ఇది వర్చువల్ ప్రపంచమే అయినా కొన్నాళ్లలో నిజమైన ప్రపంచాన్ని శాసించబోయేది ఇదే.

మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు మెటావర్స్‌గా డెవలప్ చేయడానికి బోలెడంత పెట్టుబడి పెడుతున్నాయి. ఈ పెద్ద టెక్ కంపెనీలు మెటావర్స్‌లో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాయో అర్థం చేసుకుంటే దాని అసలు రూపం ఏమిటో తెలుస్తుంది.
కనెక్టివిటీ, ఇంటర్నెట్ భవిష్యత్తు మరింత ఇంటరాక్టివ్‌గా ఉండగలగడం, ఎక్కడి నుండైనా పని చేయడం (రిమోట్ వర్కింగ్), వాడకం దారులకు బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడమే దీని ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు.
వర్చువల్, అగ్మెంటెడ్ రియాల్టీ ద్వారా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ డిజిటల్ అవతారాల్లో ప్రత్యక్షం అవ్వడం, మన అభిరుచికి తగ్గట్టుగా వర్చువల్ ప్రపంచాలు సృష్టించుకుని వాటిలో నివసించడం, అంతరిక్షంలో, సముద్రగర్భంలో విహరించడం లాంటివి మెటావర్స్‌లో సాధ్యమయ్యే మామూలు విషయాలు.

మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇమ్మర్సివ్ టెక్నాలజీస్, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయిక. మెటావర్స్ పూర్తిగా హై-స్పీడ్ ఇంటర్నెట్పై ఆధారపడిన వర్చువల్ ప్రపంచం.
మార్క్ జుకర్‌బర్గ్ మెటావర్స్‌ను వర్చువల్ ఎన్విరాన్మెంట్గా అభివర్ణించాడు. మెటావర్స్‌లో ప్రతిదీ వర్చువల్. అందులో వాస్తవికంగా ఏమి జరగదు. డిజిటల్ క్యారెక్టర్‌గా రియల్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందగలిగే ఇంటరాక్టివ్ స్పేస్ ఇది. అలాగని ఇది నిజం కాదు. కానీ, వర్చువల్ ప్రపంచంలో నిజమైన అనుభూతిని పొందగలిగేంత ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది.

వాస్తవ ప్రపంచంలో ఏ ప్రదేశాన్నైనా చూడాలి అనుకుంటే మనం నిజంగా ఆ ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది, కానీ మెటావర్స్‌లో మనం ప్రపంచంలోని ఏ మూలకైనా ఇంట్లో కూర్చొని వెళ్లవచ్చు. నిజంగా అక్కడ ఉన్నట్టే ఆ ప్రదేశంలో తిరగొచ్చు కూడా. వినటానికి కాస్త కన్ఫ్యూజ్గా అనిపిస్తోన్నా. కొన్నాళ్లలో మనం ప్రత్యక్షంగా ఈ ప్రపంచాన్ని చూడబోతున్నాం.
ఇది అనేక టెక్నాలజీలతో కలిసి రూపొందిన అదునాతన ప్రపంచం. ఇందులో వర్చువల్ మ్యూజియాన్ని సందర్శించినా, వర్చువల్ గేమ్ ఆడినా దాన్ని నిజంగా అనుభూతి చెందొచ్చు.
సింపుల్‌గా చెప్పాలంటే… మనం ఒక వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు అక్కడ కనిపించే ప్రదేశాల్లోకి మనం ఎంచుకున్న ఒక పాత్ర వెళ్తుంది. కానీ మెటావర్స్‌లో అయితే మనమే వెళ్ళొచ్చు. అదికూడా నిజమైన ప్రదేశంలోకే వెళ్ళొచ్చు. అక్కడ చూసేది నిజమైన ప్రదేశమే, అక్కడ ఉన్నదీ మనమే… కానీ, మన ఇంట్లోనే ఉండి మన వర్చువల్ అవతార్‌ని అక్కడ ఉండేలా చేస్తామన్నమాట. ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది కదా.! కానీ ఇది కొన్నాళ్లలో నిజంగా జరగబోతోంది.

వ్యాపారం కూడా జోరుగానే జరుగుతోంది.
మీరు మెటావర్స్‌లో బర్గర్ నుంచి భూమి దాకా ఏదైనా కొనొచ్చు. దాన్ని అమ్మొచ్చు కూడా. ఇలాంటి అమ్మకాలని మెక్ డొనాల్డ్స్ మొదలు పెట్టింది కూడా. మెటావర్స్ లో ఒక వర్చువల్ ప్లేస్ కొని అందులో 3డీ షాప్ కడతారు. మనం మన మెటావర్స్ అవతార్‌తో ఆ షాప్‌లోకి వెళ్ళి అక్కడ మనకు కావాల్సినదాన్ని కొనొచ్చు. అక్కడ ఆన్లైన్లో మనీ చెల్లిస్తే. రియాలిటీలో ఇక్కడ డెలివరీ చేస్తారన్నమాట.
అలాగే ఒక ఫ్లాట్ కొనాలనుకుంటే అక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఆ ఇంటిని డిజిటల్ వరల్డ్‌లోనే రీబిల్డ్ చేసి ఉంచుతారు. మనం ఆ బిల్డింగ్ మొత్తం తిరిగి చూసి రియాలిటీలో ఆ ఇంటిని కొనొచ్చు. అయితే ఇదంతా ఇప్పుడిప్పుడే రూపు దిద్దుకుంటోంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో ఇవన్నీ కలిసి మన జీవితాలని ఎలా మార్చివేస్తాయో వేచి చూడాల్సిందే.
మెటావర్స్ త్వరలోనే మన జీవితాల్లో భాగమయ్యే అవకాశాలూ ఉన్నాయి. సరైన చట్టాలూ, పాలసీలు లేకుండా ఇలాంటి టెక్నాలజీలు పెరిగిపోతే వచ్చే ఇబ్బందులూ లేకపోలేదు.

రియాలిటీలో ఇప్పటి వరకూ మనకి అలవాటైన బంధాలు, స్నేహాలు, అనుభవాలూ ఒక్కసారిగా ఈ వర్చువల్ ప్రపంచంలో ఎలా మారిపోతాయో, దీనివల్ల ఉండే లాభాలు, దీనిలో లోపాలు ముందు ముందు తెలుస్తాయి. ఒకటైతే నిజం ! మెటావర్స్ కార్పోరేట్ రంగానికి భారీ లాభాలు తెచ్చే ప్రయోగం. కాబట్టి దీన్ని కచ్చితంగా మనమీదికి తెచ్చి అంతా వాడేలా ముంచెత్తటం మాత్రం ఖాయమే.