పిచ్చుక పై బ్రహ్మాస్త్రం : ఈ రోజు ప్రపంచ ఊరపిచ్చుకల దినోత్సవం
చూడడానికి చిన్న ప్రాణే అయినా, జీవవైవిధ్యంలో తన వంతు పాత్రను పోషిస్తోన్న పిచ్చుక అంతరించిపోతే ఏమవుతుంది? అనిపించవచ్చు గానీ పంట పొలాలలో ఉండే పురుగులను తినే పిచ్చుకలు లేకపోవటం వల్లనే రకరకాల పురుగుమందుల వాడకం పెరుగుతోంది. ఫలితంగా మనం తినే ఫుడ్ విషపూరితం అవుతోంది.

పంటలు పండాల్సిన భూమి కూడా టాక్సిక్ అయిపోతోంది. దానివల్ల భూమి పొరల్లో ఉండే వానపాములు, చిన్న నత్తగుల్లలు లాంటి ప్రాణులు లేకుండా పోయాయి. దాంతో భూమి సత్తువ పెంచటానికి రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది. ఇలా ఒకదానివెంట ఒకటిగా భూమిని తద్వారా మనుషులనీ నాశనం చేసే దిశగా పోతూనే ఉన్నాం.
కాంక్రీట్ భవనాలతో నిండిన పట్టణాలలో పిచ్చుకలఉనికి పూర్తిగా కనిపించకుండా పోయింది. పల్లెలకు సైతం విస్తరించిన సెల్టవర్ల వల్ల అక్కడ కూడా అడపాదడపా ఎక్కడో చెట్లకు గూడుకట్టుకుని మనుగడ సాగిస్తున్నాయి.
తెల్లారబోతూంటే ఒక్కొక్క పక్షీ నిద్ర లేచి తన పాటలతో ప్రపంచాన్ని మేల్కొలుపుతున్నట్టు ఉండేది. ఇంటి చూరుల్లోనో, చెట్ల కొమ్మలమీదో గుంపులుగా చేరిన పిచ్చుకలు కిచకిచలతో మనల్ని నిద్రలేపేవి. అయితే నెమ్మదిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. మనతో పాటు ఉండే ఈ చిట్టి పిట్తలు ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసేవి. కూరగాయల మొక్కలనీ, పంట పొలాలనీ కీటకాల బారినుంచి కాపడుతూ ఉండేవి.

జీవన శైలిలో పెనువేగంగా వచ్చిన మార్పే పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. దీంతో పిచ్చుక జాతి అంతరించి పోతోంది. శరవేగంగా పట్టణీకరణ, అంతరిస్తున్న పచ్చదనం, రసాయనాలతో పళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తి వల్ల పిచ్చుకలకు కావాల్సిన ఆహారం అందక, గూళ్లు కట్టుకోవటానికి అనుగుణంగా లేని ఇళ్ల నిర్మానం వల్లా పిచ్చుకలు అంతరించి పోయే దశకు చేరుకుంటున్నాయి. గతంలో ఊర పిచ్చుకలు పల్లెటూర్లలో విరివిగా ఉండేవి.
రైతులు పిచ్చుకల ఆహారం కోసం వరి కంకులను గుత్తులుగా కట్టి ఇంటి చూరులకు వేలాడ దీసే వారు. ప్రస్తుతం పంటలు లేక పిచ్చుకలకు ఆహారం కరువై ఇంకా అనేక కారణాల వలన పల్లెల్లో అవి కనబడటం లేదు. గ్రామాల్లో కనిపించే ఊర పిచ్చుకల జాతి క్షీణ దశలో ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

అవే కాకుండా విచ్చలవిడిగా ఏర్పడుతున్న సెల్ టవర్లు నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు ఆ జాతికి ముప్పుగా పరిణవించాయి. రేడియేషన్ ని తట్టుకొని నలబడే విధంగా తమని తాము మార్చుకున్నా, ఆ మార్పు వేగంగా జరగకపోవటం వల్ల వాటి జనాభామీద విపరీతమైన ప్రభావం పడింది.
కృతిమమైన పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పిచ్చుక జాతిని కొంతవరకు సంరక్షించ వచ్చుని శాస్త్రవేతలు అంటున్నారు. ఊరపిచ్చుకలను సంరక్షించాలన్న లక్ష్యంతో ఏటా మార్చి 20వ తేదీని పిచ్చుకల సంరక్షణ దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
మొట్టమొదటి ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని 2010లో పాటించారు. అంతర్జాతీయంగా పిచ్చుకల సంరక్షణ కోసం ఈ దినోత్సవాన్ని నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా.. ఫ్రాన్స్‌కు చెందిన ఎకో-సిస్ యాక్షన్ ఫౌండేషన్, ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థల తోడ్పాటుతో నిర్వహిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న సహజ జీవవైవిధ్యం, జాతుల సంరక్షణ అవసరాన్ని గుర్తించి, వాటిని కాపాడుకోవడానికి ప్రజలను ఏకం చేయడమే ఈ పిచ్చుకల దినోత్సవ ముఖ్యోద్దేశం. చివరకు పిల్లలకు బొమ్మలను చూపించి పిచ్చుక ఇలా ఉంటుందని తృప్తిపడే రోజులు రావద్దని కోరుకుందాం.