‘అగ్లీ అమ్మాయిలు.. కట్నం ఇస్తే మీ పెళ్లి ఫిక్స్’.. టెక్ట్స్ బుక్‌లో ఇదొక పాఠం
విద్యార్థులకు చదువంటే విజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యతలు కూడా నేర్పడం. సమాజంలో ఉన్న రుగ్మతలను పారదోలడానికి ఏమి చేయాలో వారికి పాఠశాల, కళాశాలల్లో బోధిస్తే.. వారి మనసులో నాటుకుంటుందని అందరి అభిప్రాయం. కానీ చట్టపరంగా, నైతికంగా పాటించకూడని పద్దతులను మంచి పనులుగా పాఠాలు చెబితే? చేయకూడని పనులే గొప్ప వాటిగా అభివర్ణిస్తే.? అలాంటి పాఠమే ఒకటి ఇప్పుడు టెక్ట్స్ బుక్‌లో దర్శనం ఇచ్చింది.
నర్సింగ్ కోర్సులోని సోషియాలజీ బుక్‌లో వరకట్నం వల్ల కలిగే ప్రయోజనాలంటూ ఒక పాఠాన్ని చేర్చారు. టీకే ఇంద్రాణి రచించిన ఈ సోషియాలజీ బుక్ పేజ్ నెంబర్ 122, చాప్టర్ 6లో ‘మెరిట్స్ ఆఫ్ డౌరీ’ అనే పేరుతో పెద్ద పాఠమే ఉంది. అందవికారంగా (అగ్లీ) ఉండే ఆడపిల్లలు కట్నం ఇస్తే పెళ్లవుతుందని దాంట్లో బోధించారు. కట్నం ఇస్తే మంచి వాడు కాకకపోయినా కనీసం అందవికారంగా ఉండే అబ్బాయి అయినా దొరుకుతాడని దాంట్లో పేర్కొన్నారు. కట్నం ఇవ్వలేని తల్లిదండ్రులు మాత్రం ఆడపిల్లలను చదివిస్తారని.. ఇదొక మంచి పరిణామం అని వివరించారు. పెళ్లి అయిన వెంటనే కొత్త వస్తువులు, ఫ్రిజ్, టీవీ, బైక్ కొనుక్కోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని సూచించారు.
ఈ వివాదాస్పద పాఠ్యాంశాన్ని ఒక వ్యక్తి ట్విట్టర్లోపెట్టారు. దాన్ని శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ దేవేంద్ర ప్రధాన్‌ను ట్యాగ్ చేసి వెంటనే ఈ పాఠ్యాంశాన్ని తొలగించాలని కోరారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని ఆమె మండిపడ్డారు.