ఉప్పు మనకు శత్రువా? రాక్ సాల్ట్, టేబుల్ సాల్ట్: వీటిల్లో ఏది వాడాలి? ఎంత వాడాలి?
ఉప్పు మనం తినే ఆహారంలో చాలా ముఖ్యమైన పదార్థం. వంటల్లో రుచికోసమే కాదు మన బాడీకి కావాల్సిన కీలకమైన మూలకాల్లో ఉప్పు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మధ్య మరీ ఉప్పుని శత్రువుగా చూస్తున్నాం. కానీ, మన శరీరానికి ఉప్పు చాలా అవసరం.
మన బాడీలో జరిగే ప్రతీ రసాయనిక చర్యకు ఉప్పు అవసరం. మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచటంలో, మజిల్స్ సంకోచించడం ఉప్పు కీలకంగా ఉంటుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలు సోడియంలో ఉన్నాయి. శరీరంలో సోడియం నిల్వలు తక్కువైతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. తీసుకోవాల్సిన మోతాదుకన్నా ఎక్కువ సోడియం తీసుకున్నప్పుడు మాత్రం ఇది మనకు చెడు చేస్తుంది. అయితే, అసలు రోజుకి మనం ఎంత ఉప్పు తీసుకోవాలి? కావాల్సిన మోతాదు ఎంత?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజుకు తీసుకునే ఉప్పు 5 గ్రాములు మించితే గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, కిడ్నీ సమస్యలు ఏర్పడతాయి.
డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం కేవలం మోతాదుకు మించిన ఉప్పు వాడటం వల్ల వచ్చే గుండె జబ్బులు, స్ట్రోక్స్ తో ప్రతీ ఏటా సుమారు 30 లక్షల మంది చనిపోతున్నారు. 2025 కల్లా ప్రపంచంలో సోడియం సాల్ట్ వాడకాన్ని 30 శాతానికైనా తగ్గించాలనే లక్ష్యం పెట్టుకుంది.
నిజానికి మన శరీరంలోకి చేరుతున్న సోడియం కంటెంట్ 11 గ్రాములకు పైగా ఉండటానికి కారణం ప్రాసెస్డ్ ఫుడ్. అయితే, దేశాలవారీగా ఈ ఆహారంలో ఉప్పు మోతాదుల్లో తేడాలు ఉంటున్నాయి.

ఆలూ చిప్స్, బర్గర్లు, వేపుడు పదార్థాలలో ఒక్కో దేశానిది ఒక్కొక్క మోతాదు ఉంటోంది. కానీ మన దేశంలో మనదేశంలో ప్రమాదకర స్థితిని దాటుతున్నాయి. మన దేశంలో దొరికే 100 గ్రాముల ఆలూ చిప్స్ ప్యాకెట్లో 500 మిల్లీ గ్రాముల సోడియం ఉంటోందట. ఆలెక్కన మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్ మొత్తం మీద ఇంకెంత ఉంటుందో ఒక్క సారి ఆలోచిస్తేనే భయంగా ఉంటుంది.
అన్నిటికన్నా మనం ఎక్కువగా లైట్ తీసుకునేది చట్నీలు, టిఫిన్లలో వాడే ఉప్పుని. కొన్ని లెక్కల ప్రకారం బ్రేక్‌ఫాస్ట్ లోనే మనం ఒకరోజుకి సరిపడినంత ఉప్పుని తీసుకుంటున్నాం. అందుకే చట్నీల్లో వీలైనంత తక్కువ ఉప్పు వాడాలి.
సాల్ట్ లెస్ కిచెన్?
అయితే మనం వంటల్లో ఉప్పు లేకుండా తినాలా? అసలు ఉప్పు లేని ఫుడ్ అలవాటు చేసుకోవాలా లాంటి ఆలోచనలు అవసరం లేదు. ఉప్పు ఎక్కువ అయినప్పుడు మాత్రమే ప్రమాదం అనే విషయాన్ని మర్చి పోకూడదు. కేవలం వంటల్లో వేసే ఉప్పు మాత్రమే తగ్గిస్తే సరిపోదు. మన డైట్లో 70 శాతం సోడియం ప్రాసెస్డ్, ప్యాకెడ్జ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ద్వారానే వస్తోందన్నది ఒక స్టడీ చెబుతున్న విషయం.
రెడీమేడ్ సాస్‌లు, సోయాబీన్ సాస్‌లలో ఉప్పు స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. సూప్‌లు, బర్గర్లు, వేపుడు పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీలు, చిప్స్, ఫ్రైడ్ నట్స్, పాప్ కార్న్ వంటి చిరుతిళ్లలో, ఆఖరికి బ్రెడ్, చీజ్ వంటి పదార్థాల తయారీలో కూడా ఉప్పు మోతాదుకు మించిన స్థాయిలోనే ఉంటుందని మర్చిపోకూడదు.

మరి ఏ ఉప్పు మంచిది?
మనం సాధారణంగా వాడే ఉప్పులలో పొటాషియం అయోడైట్, అల్యూమినియం సిలికేట్ వంటివి ఉంటాయి. ఇవి మనకి ఏమాత్రం మంచిది కాదు. అంతే కాదు, మనం వాడే రిఫైండ్ ఉప్పులో 97-99శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా వాడటం మంచిది కాదు.
కల్లుప్పు (రాళ్లలాగా ఉండే ఉప్పు) శుద్ది చేయకుండా ఉంటుంది. ఇది రిఫైండ్ కాదు కానీ, దీనిలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. మనకి ఎంతో మేలు చేసే అయొడిన్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఉప్పు కన్నా సముద్రపు ఉప్పులో సోడియం 10 శాతం తక్కువగా ఉంటుంది.
లైట్ సాల్ట్ సంగతేమిటి?
‘లో సోడియం సాల్ట్’ పేరుతో 50% సోడియం ఉండే ఉప్పు కూడా మార్కెట్లో దొరుకుతోంది. పొటాషియం సాల్ట్ లో సోడియం మరింత తక్కువ మోతాదులో ఉంటుంది. కానీ, ఈ రకమైన ఉప్పును వాడాలంటే డాక్టర్ల సలహా తప్పని సరి.
కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు మాత్రమే ఈ ఉప్పును తీసుకోవాలి. దీన్ని తినడం వల్ల డైట్లో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. ఇది మరింత ప్రమాదకరం.
మరి పింక్ సాల్ట్ వాడేద్దామా?
సాధారణ ఉప్పు, సముద్ర ఉప్పుకు బదులుగా ‘హిమాలయన్ సాల్ట్’ను ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది. హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాలలో ఉండే రాళ్లనుంచి ఈ ఉప్పు వస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది అన్న ప్రచారం ఈ మధ్య జోరందుకుంది.

ఇదివరకు అక్కడక్కడా మాత్రమే కనిపించే ఈ ఉప్పు ఇప్పుడు అంతటా దొరుకుతోంది. అయితే ఇది మనం వాడే ర్ఫైండ్ ఉప్పుకన్నా మంచిదే కానీ ఆ ఉప్పుకు ఉన్న నిబంధనే ఇక్కడ కూడా వర్తిస్తుంది.
పింక్ సాల్ట్ అయినా మరొక రెడ్ సాల్ట్ అయినా ఏ ఉప్పునైనా మోతాదు దాటకుండా తీసుకోనంత వరకే అది అమనకు మంచిది. ఈ ఉప్పును కూడా మితంగా తీసుకుంటనే మేలని చెబుతున్నారు.
హిమాలయ పింక్ సాల్ట్ కూడా ఎక్కువ తీసుకుంటే రక్తపోటుకు కారణమవుతుంది. ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, గుండె వ్యాధులకు దారితీయొచ్చు.
ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన సమయంలో ఎక్కువగా క్యాల్షియం బయటకు పోయే అవకాశం ఉంది.
అయితే, ఎంత మేలు చేసేదైనా ఎక్కువ అయితే మాత్రం ప్రమాదమే. ఇది ఉప్పు మాత్రమే కాదు ఏ విషయంలో అయినా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఉప్పు ఏదైనా. లిమిట్లో వాడినంతవరకూ అది మంచిదే.