బ్లాక్ ఫిలిమ్ చట్ట విరుద్దం: ఎన్టీఆర్ కారుకి 700 జరిమానా
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను తొలగించారు. హైదరాబాద్‌లో బ్లాక్ ఫిలింతో ప్రయాణిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వాహనాన్ని అడ్డుకుని అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను పోలీసులు తొలగించారు. అంతేకాదు ఎన్టీఆర్ కారుకు రూ. 700 జరిమాన కూడా వేసినట్లు తెలుస్తోంది.
నిజానికి ఎన్టీఆర్ కారుకి బ్లాక్ ఫిల్మ్ ఉందని జరిమానా వేయటం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ స్వయంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మరీ జరిమానా కట్టారు ఎన్టీఆర్.
పోలీస్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లతో తిరిగితే కఠిన చర్యలుంటాయని ప్రకటించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెండు రోజులుగా తనిఖీలు ముమ్మరం చేశారు.
జడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న వారు తప్ప ఇతరులెవరూ వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ వాడేందుకు వీలు లేదని చట్టాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగా ఉండాలని, వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ వేయొద్దని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ స్పెషల్ డ్రైవ్ రెండు రోజులపాటు కొనసాగనుంది.