గ్యాసు ‘బండ’ : పెట్రోలు, డీజిల్ ధరల పెంపు
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. 137 రోజుల తర్వాత దేశంలో మంగళవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు 50 రూపాయలకుపైగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ తర్వాత దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది.ఇప్పుడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.21, డీజిల్ లీటరు ధర రూ. 87.47 రూపాయలుగా ఉంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు 40శాతం పెరగడంతో డీజిల్ ధరలు కూడా పెంచారు. గతేడాది నవంబర్ తర్వాత పెరగడం ఇదే తొలిసారి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి 22 మార్చి 2022 అమల్లోకి వచ్చాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో ధరలను పెంచడం అనివార్యమైనట్లు చెబుతున్నారు.
పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 96.21, లీటర్ డీజిల్ రూ. 87.47
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 110.78, లీటర్ డీజిల్ రూ. 94.94
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.109.10, డీజిల్ లీటర్ రూ. 95.49
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.8, డీజిల్ రూ. 96.83గా ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.108.20 ఉండగా, డీజిల్ ధర రూ. 94. 62గా ఉంది. ఇవాల్టి నుంచి పెంచిన ధరలతో పెట్రోలు ధర రూ.109.10, డీజిల్ 95.49కు చేరింది.