తగ్గిన మేడారం హుండీ ఆదాయం
తెలంగాణా రాష్ట్రంలో రెండేళ్లకోసారి జరిగే ఆదివాసీ ఉత్సవం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఆదివాసీ వీర వనితలని స్మరించుకుంటూ లక్షలాది మంది జరుపుకునే ఈ ఉత్సవాన్ని తెలంగాణా కుంభమేళా అంటారు. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే . వివిధ రాష్ట్రాల నుంచి ప్రతి రెండు సంవత్సరాల కొకసారి జరిగే ఈ జాతరకు రెండు కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా ఈ సంవత్సరం కూడా వైభవంగా జరిగిన ఉత్సవాల తరవాత మొదలుపెట్టిన హుండీల లెక్కింపు పూర్తి అయింది.
ఈసారి హుండీల ఆదాయం 11,44,12,707 రూపాయలు వచ్చింది. అయితే 2020లో జరిగిన జాతర కంటే ఈ సారి హుండీ ఆదాయం తగ్గడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 2020లో కోవిడ్ ప్రభావం ఎక్కువగానే ఉన్నా హుండీ ఆదాయం బాగానే ఉంది. కానీ, ఈ సంవత్సరం ఆదాయం తగ్గటం గమనార్హం.
హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి.
చిల్లర నాణేల రూపంలో 37 లక్షలు
వెండి 48.350 కిలోలు
బంగారం 631 గ్రాములు.
గత జాతరలో 11 కోట్ల 64 లక్షల ఆదాయం, బంగారం ఒకకేజీ 63 గ్రాముల 900 మిల్లీగ్రాములు, వెండి 53 కేజీల 450 గ్రాములు కాగా.. ఈ సంవత్సరం మాత్రం అంతకన్నా తక్కువగానే ఆదాయం వచ్చింది. మొత్తంగా గత జాతరతో పోలిస్తే ఈసారి మేడారం జాతర హుండీ ఆదాయం దాదాపు రూ.20 లక్షలు తగ్గిందని ఒక అంచనా.
ఎనిమిది రోజులపాటు హనుమకొండ లోని టీటీడీ కళ్యాణ మండలంలో హుండీల లెక్కింపు జరిగింది.. ఈసారి హుండీల సంఖ్య పెరగడం, కరోనా ప్రభావం కూడా ఎక్కువగా లేకపోవడంతో ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని అంచనాలు వేశారు. కానీ తగ్గిన ఆదాయం పూజారులను నిరుత్సాహానికి గురిచేసింది. హుండీ ఆదాయంలో 33శాతం పూజారులకు, 67 శాతం దేవాదాయ శాఖకు చెందుతుంది.. 13 మంది పూజారులు 33 శాతం వాటాను పంపకాలు చేసుకుంటారు.