నాలుగో వేవ్ ఉండకపోవచ్చు : ఇక కోవిడ్ పీడ వదిలినట్టేనా?
కరోనా గత మూడేళ్ళుగా ప్రపంచాన్ని ఇంతగా భయపెట్టిన, ఇబ్బంది పెట్టిన సమస్య ఇంకోటి లేదేమో. గత ఏడాది కోవిడ్ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన దేశాల్లో మన దేశం కూడా ఒకటి. రోజుకో చావు వార్త. నిమిషానికో కొత్త సేస్ అంటూ అప్డేట్. టీవీల దగ్గరనుంచి, ఇంట్లో లివింగ్ రూమ్ దాకా ఒకటే చర్చ. కోవిడ్..కోవిడ్..కోవిడ్…
ఒకటో వేవ్ భయపెడితే రెండోవేవ్ మాత్రం విశ్వరూపం చూపించింది. అదే భయంతో మూడోవేవ్ కూడా ఉంటుందని ఊహించి భయపడ్డారు. కానీ ఒమిక్రాన్ వేరియంట్ తో వచ్చిన వేరియంట్ మామూలుగానే వెళ్ళిపోవటం, మరణాల రేటు కూడా తక్కువే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారంతా.
అయితే కొద్ది కాలం క్రితమే వచ్చే జూన్‌లో ఫోర్త్‌వేవ్ వచ్చి అక్టోబర్ వరకు కొనసాగుతుందని అంచనా వేశారు. భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలో థర్డ్‌వేవ్ ముగిసినట్లే. ఇప్పుడు నాలుగో వేవ్ దశ జూన్ 22 నాటికి ప్రారంభం అవుతుందని తాజాగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. నాలుగో వేవ్.. నాలుగు నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేశారు.

నాలుగో వేవ్ తీవ్రత వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్‌వేవ్ తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలిపారు. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని, ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయని అనుకున్నారు.
దేశంలో కోవిడ్ వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. ముఖ్యంగా కరోనా థర్డ్‌వేవ్ విషయంలో కొద్ది రోజుల తేడాతో దాదాపు కచ్చితమైన అంచనా వేసింది ఐఐటీ కాన్పూర్ సైంటిస్టులు మాత్రమే.
అయితే.. నాలుగో వేవ్ విషయంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ జాకోబ్ జాన్ మాట్లాడుతూ. దేశంలో కరోనా మూడో వేవ్ ముగిసిందని. ఇప్పట్లో నాలుగో వేవ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చేశారు. దేశం మరోసారి కరోనా స్థానిక దశలోకి ప్రవేశించిందని దీంతో నాల్గవ వేవ్ ముప్పు లేదని డాక్టర్ జాకబ్ జాన్ చెప్పారు.
కొవిడ్ మరోసారి ఎండెమిక్ దశకు చేరిందని స్పష్టం చేశారు. అంతేకాదు ఆల్ఫా, బీటా, గామా, ఒమిక్రాన్ రకాలకు భిన్నంగా వ్యవహరించే వేరియంట్ ఏదైనా పుట్టుకొస్తే తప్ప నాలుగో వేవ్ దేశంలో రాదని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో మంగళవారం రోజున 3,993 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇవి 662 రోజులలో కనిష్టమైనది. గతంలో వచ్చిన శ్వాసకోశ సంబంధిత వ్యాధులన్నీ ఇన్ఫ్లుఎంజా కారణంగానే జరిగాయని.. ప్రతి ఇన్ఫ్లుఎంజా మహమ్మారి సెకండ్, థర్డ్ వేవ్‌లతో ముగిసిందని డాక్టర్ జాన్ చెప్పారు. ఐఐటీ కాన్పూర్ సైంటిస్టుల అంచనాలు తప్పినా పరవాలేదు గానీ, ఆ నాలుగో వేవ్ రాకుంటే సంతోషమే కదా.