ధనుష్ తో విడాకుల తరవాత…. ఐశ్వర్య
రజినీ కాంత్ కూతురు గానో, ధనుష్ భార్యగానో కాకుండా తమిళ చిత్ర సీమలో డైరెక్టర్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. డైరెక్టర్ గా తాను ఓ హిందీ సినిమా చేస్తున్నట్టు నాలుగు రోజులకిందే సోషల్ మీడియాలో ప్రకటించింది.
‘‘ఈ వారాన్ని ఇంతకంటే అద్భుతంగా ప్రారంభించలేను. డైరెక్టర్ గా బాలీవుడ్లో నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ‘ఓ సాథీ చల్’ అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాను. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అంటూ పొస్ట్ చేసింది. మీను అరోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఇప్పుడు అదే సినిమాలోని “ముసాఫిర్” అనే సాంగ్ యూట్యూబ్లో అప్ లోడ్ చేసిన తొమ్మిది గంటల్లో 1.9 మిలియన్ వ్యూస్ సాధించింది అంటూ సంతోషంగా చెప్పింది. సాంగ్ వరకూ చూస్తే మాత్రం తమిళ నేటివిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సో! బాలీవుడ్ కోలీవుడ్ రెండు మార్కెట్లనీ టార్గెట్ చేసుకుని సినిమా చేస్తున్నారని అర్థమైపోయింది.
ఇటీవల దర్శకురాలిగా పాయని సాంగ్ రూపొందించారు ఐశ్వర్య. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సాంగ్ అద్భుతంగా ఉందంటూ ఐశ్వర్య మాజీ భర్త హీరో ధనుష్ సైతం ట్విట్టర్ ఖాతా ద్వారా విషెస్ తెలుపగా.. థ్యాంక్స్ అంటూ ఐశ్వర్య రిప్లై ఇచ్చింది.
2012లో ‘త్రీ’ సినిమాతో దర్శకురాలిగా మారింది ఐశ్వర్య. ఆ తర్వాత 2015లో ‘వెయ్ రాజా వెయ్’ సినిమా తెరకెక్కించింది. ఇక 2017లో ‘సినిమా వీరన్’ అనే డాక్యుమెంటరీకి కూడా దర్శకత్వం వహించింది. దర్శకురాలిగానే కాదు తమిళ సినిమాలు ‘విజిల్, ఆయిరత్తిల్ ఒరువన్’ సినిమాల్లో పాటలు పాడటమే కాదు ‘ఆయిరత్తిల్ ఒరువన్’ సినిమాలో రీమాసేన్ కి డబ్బింగ్ కూడా చెప్పింది.