ఉక్రెయిన్ సైన్యంలో చేరిన తమిళనాడు విద్యార్థి
రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతున్న సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారతీయులు ఉరుకులు పరుగులు పెడుతోంటే తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి మాత్రం యుక్రెయిన్ ఆర్మీలో చేరాడు.
శాంతి చర్చలు విఫలమవుతోన్న క్రమంలో మరోపక్క యుద్దం కూడా మరింత భీబత్సంగా మారుతోంది. ఉక్రెయిన్ లో చిక్కుపోయిన భారతీయుల్లో కొందరిని స్వదేశానికి రప్పించింది కేంద్రం. కానీ ఇంకొందరు మాత్రం విధిలేని స్థితిలో, మరికొందరు స్వచ్ఛందంగా అక్కడే ఉండిపోయారు.
తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి అయితే ఏకంగా ఉక్రెయిన్ సైన్యంలో చేరిపోవడం సంచలనంగా మారింది. సాయినికేష్ 2018లో ఖార్కివ్లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లారు. కానీ అతను జూలై 2022 నాటికి ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంది.

సాయి నికేష్ ఉక్రెయిన్ సైన్యంతో ఉన్నట్టుగా సర్క్యులేట్ అవుతున్న చిత్రం
అలా అక్కడే ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన సాయినికేష్తో అతని కుటుంబ సభ్యులు కమ్యూనికేషన్ కోల్పోయారు. దీంతో వారు భారత రాయబార కార్యాలయం సహాయం కోరారు. దీంతో రాయబార కార్యాలయం అధికారులు.. సాయినికేష్ను సంప్రదించగలిగారు. అయితే సాయినికేష్ రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలటరీ దళాలలో చేరినట్టుగా తెలిసింది.
సాయినికేష్ వాలంటీర్లతో కూడిన Georgian National Legion paramilitary unitలో చేరి రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. దీంతో అధికారులు అతని నివాసానికి వెళ్లి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నిజానికి సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడని కానీ తిరస్కరించబడిందని తెలిపారు.