ఇది నెక్స్ట్ లెవెల్ చోరీ: ఆఫీసర్లమని చెప్పి బ్రిడ్జినే ఎత్తుకెళ్లారు
ఇలాంటి సీను సినిమాలో పెట్టినా కామెడీ అనుకుంటారు. దొంగలు బ్రిడ్జి ఎత్తుకెళ్లడం ఏంటి? ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా అని ప్రశ్నిస్తారు. కానీ నిజంగా ఇది జరిగింది. ఎక్కడో కాదు.. మన దేశంలోని బీహార్ రాష్ట్రంలో ఈ వింత దొంగతనం జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
బీహార్లోని రోహ్తాస్ జిల్లా అమియవర్ గ్రామంలోని అరాహ్ కాల్వపై ఒక స్టీలు బ్రిడ్జి ఉన్నది. 500 టన్నుల బరువైన ఈ బ్రిడ్జిని కొంత మంది దుండగులు జేసీబీ, గ్యాస్ కట్టర్లు తీసుకొని వచ్చి పూర్తిగా విడదీసి తరలించుకొని పోయారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బ్రిడ్జి తొలగిస్తున్నామని.. తాము గవర్నమెంట్ ఆఫీసర్లమని గ్రామస్థులకు చెప్పారు. గతంలోనే శిథిలావస్థకు చేరిన ఆ బ్రిడ్జిని తొలగించమని గ్రామస్థులు వినతిపత్రం ఇచ్చి ఉండటంతో.. నిజంగానే అధికారులే వచ్చారని ఊర్లో వాళ్లు నమ్మారు.
మూడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు నట్లు, బోల్టులు పీకి ఏ ముక్కకు ఆ ముక్క ట్రక్కుల్లో వేసుకొని తరలించారు. పాపం దొంగలని తెలియక.. వాళ్లకు స్థానికులుకూడా సాయం చేశారు. అయితే కొంత మంది గ్రామస్థులకు అనుమానం వచ్చి అధికారులకు పిర్యాదు చేశారు. వాళ్లు వచ్చే లోపే ఈ దుండగులు ఒక్క ముక్క కూడా దొరకకుండా మొత్తం అక్కడి నుంచి తరలించేశారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ స్క్రాప్ అంతా ఎక్కడికి పోయిందో అనే అరాతీసే పనిలో పోలీసులు ఉన్నారు.