జాతి రత్నాలు.. తాగిన మైకంలో పెళ్లి చేసుకున్న యువకులు
జాతిరత్నాలు సినిమా తర్వాత జోగిపేట చాలా ఫేమస్ అయ్యింది. అదలా ఉంచితే.. ఇప్పుడు జోగిపేట మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ వార్త చదివితే మీకు నవ్వుతో పాటు ఇద్దరు యువకులపై జాలి కూడా కలుగుతుంది. ఎందుకంటే.. ఫుల్లుగా తాగిన మైకంలో ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అసలేం జరిగిందంటే..
సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడికి, మెదక్ జిల్లా చిలప్చేడ్ మండల చండూరుకు చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవర్‌కు ఒక కల్లు దుకాణంలో పరిచయం అయ్యింది. అప్పుడప్పుడూ కల్లు దుకాణంలో, వైన్స్‌లో కూర్చొని తాగుతుండేవాళ్లు. ఇదే క్రమంలో ఈ నెల 1న ఇద్దరూ కలసి ఫుల్లుగా మందు కొట్టారు. తాగిన మైకంలో ఆ యువకుడు.. ఆటో డ్రైవర్‌తో తాళి కట్టించుకున్నాడు. విషయం ఇక్కడితే ముగిసిపోతే బానే ఉండేది. కానీ అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయ్యింది.
తాళి కట్టించుకున్న యువకుడు తన భర్త (అలా అనొచ్చా) అయిన ఆటో డ్రైవర్‌ను తీసుకొని ఇంటికెళ్లాడు. ఇద్దరం పెళ్లి చేసుకున్నామని.. కలిసి ఉంటామని తల్లిదండ్రులకు చెప్పాడు. ఫస్ట్ జోక్ అనుకున్న ఇంట్లో వాళ్లు.. వాళ్ల యవ్వారం చూసి కాస్త మందలించారు. ఆ ఆటో డ్రైవర్‌ను కూడా రెండు తిట్లు తిట్టి పంపించేశారు. అయితే, ఆ ఆటో డ్రైవర్ మాత్రం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేశాడు. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తిని కలవకుండా చేస్తున్నారంటూ కేసు పెట్టాడు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా భీష్మించుకొని కూర్చున్నాడు.
దీంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను, గ్రామ పెద్దలను పోలీసులు పిలిపించి మాట్లాడారు. ఎవరు ఎంత నచ్చజెప్పినా ఆటో డ్రైవర్ మాత్రం మొండి పట్టు వీడలేదు. తనకు రూ. 1 లక్ష ఇస్తేనే కేసు వాపస్ తీసుకుంటానని తేల్చి చెప్పాడు. చివరకు అందరూ కలసి నచ్చజెప్పి రూ. 10 వేలకు సెటిల్మెంట్ చేశారు. డబ్బులు తీసుకున్న ఆటో డ్రైవర్.. ఆ తర్వాత కేసు వాపస్ తీసుకున్నాడు. తాగిన మత్తులో ఆ ఇద్దరు యువకులు చేసిన పని ఇప్పుడు జోగిపేట్‌లో చర్చనీయాంశం అయ్యింది.
April 6, 2022 @ 8:55 am
All the best