శ్రీరామ నవమి: రెండు రోజులు మందు బంద్, శోభాయాత్రలకు పరిమితులు
శ్రీరామ నవమి ఉత్సవాల కారణంగా హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మధ్యం షాపులు ఓపెన్ చేయకూడదని హైద్రాబాద్ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వైన్ షాపులతో పాటు కల్లు కాంపౌండ్స్ సైతం మూత పడనున్నాయి.
నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా 48 గంటల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు, బార్లు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే స్టార్ హోటల్స్, రిజిస్టర్ అయిన క్లబ్‌లను దీని నుంచి మినహాయింపు కల్పించారు. అంటే స్టార్ హొటల్స్‌లో బార్లకు, కొన్ని ప్రత్యేకమైన క్లబ్స్‌కు ఈ నిబంధనలు వర్తించవు.
అంతే కాదు.. శోభాయాత్రలో అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్, భైంసాలో పోలీసుల మార్గదర్శకాల మేరకు నిర్వహించాలని, పోలీసులకు సహకరించాలని నిర్వాహకులకు కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శోభాయాత్ర జరపాలని, శోభాయాత్రకు 200 మంది వరకు అనుమతి ఉంటుందని.. నిర్వాహకులకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.