“జెలెన్ స్కీ” ప్రపంచానికో కొత్త హీరో…
నిన్నా మొన్నటి వరకూ ఉక్రెయిన్ అనే పేరు కూడా పెద్దగా పరిచయం లేని వాళ్లకి ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేరూ, అతని ఫొటో కూడా మర్చిపోలేనంతగా తెలిసింది.

రాజకీయాల్లోకి రాకముందు జెలెన్ స్కీ కమెడియన్ అని చెబితే కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ అదే నిజం. జెలెన్ స్కీ పూర్తిపేరు వ్లోదిమియర్ ఒలెక్సాండ్రో విచ్ జెలెన్ స్కీ. ఇప్పుడు టీవీలలో హుందాగా కనిపిస్తున్న ఈ వ్యక్తే ఒకప్పుడు పాపులర్ కామెడీ నటుడుగా టీవీ షోలలో కనిపించి అందరినీ కడుపుబ్బా నవ్వించేవాడు. కమెడియన్ కమ్ మంచి యాక్టర్ జెలెన్ స్కీ. ఈయనకు ఒకప్పుడు రష్యాలో కూడా అభిమానులున్నారు. జెలెన్ స్కీ అందంగా ఉంటాడు, చాలా సున్నితమైన వ్యక్తిగా పేరుంది. కానీ మాట మాత్రం గంభీరంగా ఉంటుంది. అద్భుతమైన మాటలతో ఆకట్టుకోగల వాక్చాతుర్యం అతని సొంతం.

జెలెన్ స్కీ 1978, జనవరి 25న అప్పటి సోవియట్ యూనియన్ (అప్పుడు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ లో భాగం) లోని ఉక్రెయినియన్ ఎస్ఎస్ఆర్ లో పుట్టాడు.
జెలెన్ స్కీ కీవ్ నేషనల్ ఎకనామిక్ యూనివర్సిటీ లో ఎల్ఎల్బీ చేశాడు.కానీ ఆ “లా” డిగ్రీని పక్కన పెట్టి లాయర్ గా కాకుండా నటుడిగా ఉండటానికే ఇష్టపడ్డ జెలెన్ కమెడియన్ గా మారి టివి షో లలో స్పెషల్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. అలా లా పూర్తిచేసిన తరవాత కూడా అటు వైపు వెళ్లకుండా సొంతంగా ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి అందులో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ జెలెన్ స్కి టివి షో ని నడిపాడు. అలా రాజకీయాల్లోకి రాకముందే నటుడిగా గుర్తింపు పొందాడు జెలెన్ స్కీ.

ఆయన తాత రెండో ప్రపంచ యుద్ధంలో ఆర్మీలో పనిచేశాడు. ఆయన అప్పట్లో స్వతంత్ర ఉక్రెయిన్ కోసం జరిగిన యుద్ధంలో కల్నల్ గా కన్నుమూశారట. అదే వారసత్వాన్ని జెలెన్ స్కీ కంటిన్యూ చేస్తున్నాడు. 2019 ఉక్రెయిన్ అధ్యక్ష పోటీ ఎన్నికల్లో పోటీ చేసిన జెలెన్ స్కీ ఆయనకున్న గుర్తింపు, మాటల్లో గంభీరత్వం, కలుపుకుపోయే తనంతో ఎవ్వరూ ఊహించని విధంగా 73శాతం ఓట్లతో గెలిచాడు. అలా ఉక్రెయిన్ కి ఆరవ అధ్యక్షుడి గా నిలిచి పాలిస్తున్నాడు.
ఇప్పుడు తొలినుంచీ నమ్మిన అమెరికా మొహం చాటేసినా, నాటో నుంచి ఎలాంటి సహాకారం అందకపోయినా తాను మాత్రం వెనుకడుగు వేయలేదు. దేశం దాటి పారిపోలేదు. గత కొన్ని రోజులుగా ఒకవైపు చర్చలు జరుగుతూ, మరో వైపు మారణయుధాలతో రష్యా సైనికులు విరుచుకుపడుతున్నా వారికి వారి పద్ధతిలోనే సమాధానం చెప్తు అందరితో సలాం కొట్టించుకుంటున్నాడు జెలెన్ స్కీ. యుద్ధం లో గెలిచినా, ఓడినా ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం ప్రపంచం దృష్టిలో ఒక హీరోగా మాత్రం నిలిచిపోతాడనటంలో అనుమానమే లేదు.

జెలెన్ స్కీ భార్య పేరు ఒలేనా కీయాస్కో. వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్ని సమస్యలు ఎదురైనా, యుద్ధం ఎంత భీకరంగా సాగినా దేశ విడిచిపెట్టి పోయే ప్రసక్తే లేదని సోషల్ మీడియా వేదికగా అందరికి సమాధానం ఇచ్చింది. భర్తకు తోడుగా, ధైర్యంగా ఉంటానని, పిల్లలు సురక్షితమైన ప్లేస్ లో ఉంచామని తాము మాత్రం ఎక్కడికి పారిపోలేదని చెప్పి అతమ్న దేశం మీద ఉన్న ప్రేమని, బాధ్యతనీ ప్రకటించింది. తమను ఆక్రమించుకునేందుకు రష్యా చేస్తున్న దాడులకు ఎదురొడ్డి యుద్ధ రంగంలో నిలబడ్డ ఫొటోలు చూసి ప్రపంచంలో చాలామంది అతన్ని పొగుడుతున్నారు. ఆర్మీ డ్రెస్ లో ఒక దేశాధ్యక్షుడు కనిపించటం ఎంతోమందిని ఇన్స్పైర్ చేసింది. మనమంతా కలిసి పోరాడుదాం.. విజయం సాదిద్దాం” అంటూ యుద్దంలో తాను ముందుండి ఉక్రేనియన్ పౌరుల్లో స్ఫూర్తిని నింపుతున్నాడు. ఇప్పుడు ప్రపంచ మీడియా జెలెన్ స్కీని వెన్నుచూపని వీరునిగా, రియల్ హీరోగా ఆకాశానికి ఎత్తుతోంది.