తెలంగాణ బడ్జెట్ 2022-23 హైలెట్స్
2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణా వార్షిక బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలైన సంగతి తెలిసిందే.
2,56,958.51 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సభ ముందుంచారు. రెవెన్యూ వ్యయం రూ.1,89,274 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.29,728 కోట్లుగా చెప్పారు. వ్యవసాయం, విద్య, ఆసరా పించన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చింది. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించలేదు.
దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులను భారీగా పెంచారు. గత వార్షిక బడ్జెట్లో వెయ్యి కోట్లను కేటాయించగా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం రూ. 17,700 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈలోపాన్ని నివారించేందుకు, ‘కేసీఆర్ నూట్రీషియన్ కిట్’ అనే పేరుతో పోషకాహారంతో కూడిన కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిర్ణయించింది. ఈ కిట్స్ ద్వారా ప్రతి సంవత్సరం లక్షా 25 వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు.
దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందిస్తున్నది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించారు.
డబుల్ బెడ్ రూం పథకం అంటూ ప్రత్యేకంగా చెప్పకుండానే.. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. దీనికోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లు ప్రతిపాదించారు. గీత కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల కోసం కొత్త పథకాలు తీసుకువస్తామని తెలిపారు.

బడ్జెట్లో కొన్ని ముఖ్యమైన కేటాయింపులు
వ్యవసాయానికి రూ.24,254 కోట్లు
ఆసరా పింఛన్లు రూ.11,728 కోట్లు
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ రూ.2,750 కోట్లు
దళితబంధు రూ.17,700 కోట్లు
మన ఊరు-మనబడి రూ.7,289 కోట్లు
ఎస్టి సంక్షేమం రూ.12,565 కోట్లు
పట్టణ ప్రగతి రూ.1,394 కోట్లు
బిసి సంక్షేమం రూ.5,698 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమం రూ.177 కోట్లు
పల్లె ప్రగతి రూ.3,330 కోట్లు
హరితహారం రూ.932 కోట్లు
రోడ్లు, భవనాల కోసం రూ.1,542 కోట్లు కేటాయించారు.