ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? ఈ ఎన్నికల వల్ల లాభపడిన పార్టీ ఏంటి?
దేశంలోని ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికలు నిన్నటితో పూర్తయ్యాయి. అలా చివరి దశ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే జాతీయ మీడియా, సర్వే ఏజెన్సీలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. కీలకమైన రాష్ట్రాల్లో బీజేపీ దాదాపు పట్టు నిలుపుకోగా.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్లే కనిపిస్తున్నది. ఇక ఢిల్లీలో ఇప్పటికే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా జోరు కనపరుస్తున్నది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికలను ఏ మాత్రం సార్వత్రిక ఎన్నికలతో సంబంధం కలపలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశంలో అత్యంత బలమైన పార్టీగా మారిన బీజేపీ మరోసారి అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో పట్టు నిలుపుకున్నట్లే కనపుడున్నది. యూపీతో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో అధికారాన్ని చేపట్టే అవకాశం ఉన్నది. ఒకటి రెండు సీట్లు మెజార్టీకి తక్కువైనా బీజేపీ తన చాణక్యంతో అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ గతంలో కంటే సీట్లు పెంచుకున్నా.. అధికారాని మాత్రం దూరంగానే నిలుస్తున్నట్లు తెలుస్తున్నది. బీఎస్పీ పోటీ చేయకపోవడం వల్ల ఈ ఎన్నికల్లో ఎస్పీ కాస్త లాభపడినట్లుగానే తెలుస్తున్నది.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఈ సారి పంజాబ్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలు ఆప్‌కు లాభించిందని చెప్పవచ్చు. రైతు చట్టాల నేపథ్యంలో పంజాబ్ ప్రజలు బీజేపీకి దూరమైనా.. కాంగ్రెస్‌కు ఆప్ ప్రత్యామ్నాయంగా భావించారు. పంజాబ్ వంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోవడం పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. అంతర్గత పోరే కాంగ్రెస్‌ను ముంచిందని చెప్పవచ్చు.
మొత్తానికి ఈ అసెంబ్లీ ఎన్నకల వల్ల బీజేపీ మరోసారి తన బలాన్ని నిరూపించుకోగా.. కేజ్రీవాల్ కూడా ఒక బలమైన నేతగా ఎదిగాడు. 2024 నాటికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని పలువురు నేతలు ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. వారిలో కేజ్రీవాల్ కూడా ఒకరు. ఈ ఎన్నికల తర్వాత అతడి మాటకు మరింత విలువ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మోదీ వారసుడిగా అందరూ చెప్పుకుంటున్న యోగి ఆదిత్యానాథ్ మరోసారి యూపీలో అధికారం చేపట్టడంతో.. ఆ తర్వాత అతడి అడుగులు హస్తినవైపే అని విశ్లేషకులు చెబుతున్నారు.