మధ్యప్రదేశ్‌లో బొగ్గు తవ్వకాలు మొదలు పెట్టిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం ఎంపీలో బొగ్గు తవ్వకాలను ఎలా చేపట్టిందని మీకు అనుమానం రావచ్చు. కానీ ఇది అక్షరాలా నిజం. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మధ్యప్రదేశ్‌లోని సిగ్రౌంలీ జిల్లా సులియారీ బ్లాక్‌లో బొగ్గు తవ్వకాలు ప్రారంభించినట్లు ఏపీఎండీసీ వైస్ చైర్మన్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2007లో ఏపీకి కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లోని సులియారీ బ్లాక్‌ను కేటాయించింది. ఆ తర్వాత పలు ఆటంకాలు, రాష్ట్ర విభజన జరగడంతో అది ఇరు రాష్ట్రాల్లో ఎవరికి చెందాలనే వివాదంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. అయితే ఆ బ్లాకు తెలంగాణకు కాకుండా ఏపీకి చెందుతుందని కేంద్ర తేల్చి చెప్పడంతో ఏపీఎండీసీ ఉత్పత్తిని ప్రారంభించింది.
దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న మూడో ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డులకు ఎక్కింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సింగరేణి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తిలో ఉన్నాయి. వీటికి ఏపీఎండీసీ జతకలిసింది. ఏడాదికి 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే సులియారీ బ్లాక్ వద్ద బొగ్గు ఉత్పత్తి కోసం రూ. 2000 కోట్లను పెట్టుబడిగా ఏపీ ప్రభుత్వం పెట్టింది. ఇక్కడ బొగ్గు ఉత్పత్తి ద్వారా ఏడాదికి రూ. 1200 కోట్లు ఆదాయం వస్తుందని సమాచారం.
ఈ బ్లాకులో 22 ఏళ్ల పాటు బొగ్గును ఉత్పత్తి చేసే వీలున్నది. ప్రతీ ఏడాది 7 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి చేయాలని ఏపీఎండీసీ భావిస్తున్నది.