ఏపీలో మరో కొత్త జిల్లా రాబోతున్నదా? జిల్లా కేంద్రం ఎక్కడ?
ఏపీలో పాత 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలు సోమవారం నుంచి మనుగడలోకి వచ్చాయి. కొత్త జిల్లాలను ఒకే సారి ప్రారంభిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీట నొక్కారు. వెంటనే కొత్త 13 జిల్లాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న భవనాల్లో కొత్త జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త జిల్లాలకు అవసరమైన కలెక్టర్లు, ఎస్పీ, ఆర్టీవోలతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా నియమించింది. పాత జిల్లాల్లో ఉన్న జాయింట్ కలెక్టర్లను కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా నియమించింది.
ఇదంతా గడిచి 24 గంటు కాకముందే మరో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లా అన్నింటికంటే వైశాల్యపరంగా చాలా పెద్దగా ఉన్నది. దీంతో గిరిజన ప్రాంతాలన్నింటినీ కలపి ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నదని నాని చెప్పారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాలతో కలిపి రెండు జిల్లాలు చేశారు. అయితే పాలన మరింత సులభతరం చేయడానికి మరో కొత్త జిల్లా ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నదని నాని చెప్పారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాకు పాడేరు జిల్లా కేంద్రంగా, మన్యం జిల్లాకు పార్వతీపురం హెడ్ క్వార్టర్‌గా ఉన్నాయి. వీటికి తోడు మరో జిల్లాను ఏర్పాటు చేస్తే.. హెడ్ క్వార్టర్‌గా దేన్ని నియమిస్తారనే అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా కొత్త జిల్లాలు ప్రారంభమైన మరుసటి రోజే మరో జిల్లా ప్రకటన రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. రాబోయే రోజుల్లో డిమాండ్లకు అనుగుణంగా రెండు, మూడు కొత్త జిల్లాలు వచ్చినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదని తెలుస్తున్నది.