అట్టడుగు నుండి అంతర్జాతీయ స్థాయికి
అట్టడుగు జీవితం నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్
40 ఏళ్ళు పార్లమెంటేరియన్ గా వరల్డ్ రికార్డు ఉన్న గొప్ప నాయకులు , నవ భారత నిర్మాణ దశలో కీలక భూమిక పోషించిన మహనీయులు జగ్జీవన్ రామ్.
బీహార్ లోని మారు మూల పల్లె ‘ చాన్ద్వా ‘ లో ఏప్రిల్ 5 , 1908 లో అట్టడుగు చమార్ కుటుంబం లో పుట్టి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO సదస్సుకు హాజరైయ్యేంత ఖ్యాతి గడించిన బాబూ జగ్జీవన్ రామ్ జీవితం అత్యంత స్ఫూర్తి దాయకం.

అర్రా లోని పాఠశాల లో హిందూ పిల్లలకు ముస్లిం పిల్లలకు రెండు విడి కుండలు ఉండేవి.దళిత పిల్లలు ఒకరో ఇద్దరో హిందూ పిల్లలు కానీ ముస్లిం పిల్లలు ఎవరైనా దయతలచి లోటాతో పోస్తే అరచేతిలో తాగేవాళ్ళు.ఒకనాడు జగ్జీవన్ రామ్ కు దాహమై క్లాస్ దగ్గర ఎవరూ లేకపోవడంతో హిందూ కుండలోని నీళ్ళు త్రాగాడు. అది గమనించిన ఇతర పిల్లలు టీచర్లు ఇష్టం వచ్చినట్టు తిట్టారు.జగ్జీవన్ మొదటి నుండి దుడుకు స్వభావం.మొండిగా ఉండేవాడు. కోపంతో పెద్ద కర్ర తీసుకొచ్చి రెండు కుండలూ పగలగొట్టేసాడు.మంచినీటి కుండలు వేరుగా పెడితే దళిత పిల్లలకు ఇంకో కుండ పెట్టాల్సిందే అని గొడపడ్డాడు.

అక్కడ మొదలైన ఆ పట్టుదలతో కూడిన ప్రస్థానం ,భారత రాజ్యాంగ ప్రతిలో సామాజిక న్యాయం కోసం గళమెత్తడం దాకా కొనసాగింది.
బీహార్ కు వచ్చి జగ్జీవన్ ప్రసంగం విని, చదువులో ఇతర సేవా కార్యక్రమాల్లో జగ్జీవన్ చురుకుదనం చూసిన మదన్ మోహన్ మాలవ్యా ఆయనకు బెనారస్ హిందూ యూనివర్సిటీ లో చేరే అవకాశం కల్పించారు.మెట్రిక్యులేషన్ ఫస్టు క్లాస్ లో పాస్ అయి బెనారస్ విశ్వవిద్యాలయం లో చేరాడు.

BHU లో హాస్టల్ లో ఎంతో కుల వివక్షను అనుభవించాడు జగ్జీవన్ రామ్.యూనివర్సిటీ కి వచ్చే మంగలి అతనికి క్షవరం చేయడానికి నిరాకరించేవాడు.ఇతర వసతుల కల్పనలో అతనిని చిన్నచూపు చూసేవారు.హాస్టల్ నిర్వాహకులతో గొడవపడి దళిత విద్యార్థుల కు అక్కడే క్షవరం చేసేదాకా వదిలిపెట్టని పోరాట పటిమ అతని సొంతం.
ఇంటర్ సైన్స్ పూర్తి చేసుకుని ,బెనారస్ విశ్వవిద్యాలయాన్ని వదిలి కలకత్తా లో బీఎస్సీ డిగ్రీ చేసి ,పట్టా పుచ్చుకున్నాడు.

1934 లో నేపాల్ – బీహార్ లో సంభవించిన భూకంపం ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది..జగ్జీవన్ ఇచ్చిన పిలుపుతో ఆయన నాయకత్వం లో వందలాది యువకులు రిలీఫ్ క్యా0పులు నిర్వహించి, బాధితులకు అండగా ఉన్నారు.జగ్జీవన్ సేవా కార్యక్రమాలు గమనించిన సుభాష్ చంద్రబోస్ జాతీయ మజ్దూర్ రాల్యి కు ఆహ్వానించాడు.
భారత రాజ్యాంగానికి మూలమని చెప్పుకునే 1935 చట్టం తయారీకి వివక్ష పై గొంతెత్తి ఎక్కడ అన్యాయం జరిగినా వెళ్ళి న్యాయం కోసం నాయకత్వం వహించే జగ్జీవన్ ను సంప్రదించారు.బీహార్ తరపున కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. ఒకసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఇక తిరిగి చూడలేదు.అవిశ్రాంతంగా 30 ఏళ్ళ పాటు పార్లమెంట్ కు ఎన్నికై రికార్డు సృష్టించారు.
కీలక యుద్ధ సమయాల్లో రక్షణ మంత్రిగా పనిచేసి బంగ్లాదేశ్ అవతరణలో భాగం అయ్యారు.
అసమాన ప్రతిభ , ముందు చూపు నాయకత్వ లక్షణాలు జగ్జీవన్ శాస్త్రీయ దృక్పథం నేహ్రూ ను ఎంతో ఆకట్టుకునేవి. నిరుపేదల కరువుల బాధలెన్నో చూసిన జగ్జీవన్ ఆహార సమృద్ధి ఆవశ్యకత గురించి నేహ్రూ తో ఎల్లవేళలా చర్చించేవారు.మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక లో వ్యవసాయ రంగానికి , నీటిపారుదల కు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం జగ్జీవన్ రామ్ అంటే అతిశయోక్తి కాదు.1960 లో హరిత విప్లవం కోసం పాటుపడిన జగ్జీవన్ ఆ కల సాకారం అయ్యేందుకు వ్యవసాయ శాఖ మంత్రి గా ముఖ్య భూమిక పోషించారు.

ఎన్ని పదవులు అధిరోహించినా సామాజిక న్యాయమే ఎజండాగా జీవించారు.మాట పట్టింపు తో కాంగ్రెస్ ను వీడి ఐదుగురు సభ్యులతో జనతా పార్టీ తో ప్రతిపక్షం లో చేరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ఆదివారం ఢిల్లీలోని ‘ రామ్ లీలా మైదానంలో జగ్జీవన్ ప్రసంగం ఉందని ప్రభుత్వం ఆరోజు , ఆ మీటింగ్ కు యువకులు వెళ్ళకూడదని దూరదర్శన్ లో దేశంలోని యువత ఉర్రూతలూగేలా చేసిన రిషీ కపూర్ హీరోగా నటించిన ‘ బాబీ ‘ సినిమా టెలికాస్ట్ చేయిన్చింది .ప్రభుత్వానికి పరాభవం తప్పలేదు.బాబీ సినిమా కన్నా జగ్జీవన్ రామ్ మాటలే ముఖ్యమని ఎడ్లబండ్ల పై ప్రయాణం చేసి వచ్చారు.రాంలీలా మైదానం జనం తో కిటకిటలాడింది.మర్నాడు పత్రికలలో హెడ్లైన్ ” Babu Beats Bobby” విదేశీయులను సైతం ఆకర్షి0చింది.
ఇట్లాంటి అనేక ఆసక్తికరమైన సంఘటన లు జగ్జీవన్ జీవితంలో కోకొల్లలు.ఆయన 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం , ఎదుర్కొన్న ఒడిదుడుకులు , అప్పటికప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన ఎంత మహోన్నతుడో తెలియజేస్తాయి.జీవిత చరమాంకం వరకూ బడుగు , దళిత జీవితాలకు సామాజిక న్యాయం కోసం పోరాడిన బాబుజీ , బాబు జగ్జీవన్ రామ్ గారికి భారత రత్న ఇవ్వాలి.
అట్టడుగు జీవితం నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఒక గొప్ప దార్శనికుడు , దృఢమైన వ్యక్తిత్వం , పోరాట పటిమ కలిగిన నిజమైన లీడర్ బాబూ జగ్జీవన్ కు వినమ్ర శ్రద్ధాంజలి.
Text Source – Rajitha Kommu