ఆవు పేడతో చేసిన సూట్ కేసులో రాష్ట్ర బడ్జెట్.. పోలా.. అదిరిపోలా
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌ను సమర్పించేందుకు ఆయన ‘ఆవు పేడ’తో తయారు చేసిన ప్రత్యేక ‘బ్రీఫ్‌కేస్’తో వచ్చారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.పర్యావరణ హిత వస్తువులపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ సూట్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చి శాసనసభలో వార్షిక పద్దును ప్రవేశపెట్టారు సీఎం భూపేష్ బఘెల్.
ఛత్తీస్‌గఢ్‌లో ఆవు పేడని లక్ష్మికి ప్రతీకగా భావిస్తారు. రాష్ట్రంలో తీజ్ పండుగల సమయంలోనూ ప్రజలు తమ ఇళ్లను ఆవు పేడతో అలికి సుందరంగా ముస్తాబు చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘ఏక్ పహల్’ స్వయం సహాయక సంఘాల మహిళలు గోమాయ్ బ్రీఫ్‌కేస్‌ను తయారు చేశారు.
ఆవు పేడకు చెందిన పొడి, గమ్, పిండి, ఇతర పదార్థాలతో పాటు కొండగావ్‌కు చెందిన కళాకారులు ఈ సూట్‌కేస్ తయారు చేశారు. హ్యాండిల్ కలపతో చేశారు. ఆ సూట్‌కేసుపై సంస్కృతంలో ‘గోమయే వసతే లక్ష్మి’ అని రాసి ఉంది. అంటే దీని అర్థం ‘ఆవు పేడలో లక్ష్మి దేవి ఉంటుంది’ అని అర్థం. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆవుపేడతో తయారైన బ్రీఫ్‌కేస్‌తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం భారత్‌లో ఇదే తొలిసారి.
ఆవుల పెంపకందారులను ప్రోత్సహిస్తూ ఆవులను సంరక్షించేలా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ఆవులను పెంచే రైతుల నుంచి పేడను కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలా సేకరించిన ఆవు పేడతో వర్మీకంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఆవు పేడతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గత నెలలో పశువుల పెంపకం గ్రామస్తులు, గౌతన్‌లు, గౌతమ్ కమిటీలతో సంబంధం ఉన్న మహిళా సంఘాల కోసం తన ప్రధాన పథకం గోధన్ న్యాయ్ యోజన కోసం రూ.10.24 కోట్లను విడుదల చేసింది. పశువుల యజమానులకు కనీస ఆదాయ మద్దతును అందించడమే ఈ పథకం లక్ష్యం. ఆవు పెంపకందారులు, రైతుల నుంచి ఆవు పేడను సేకరిస్తామని 2020లో రాష్ట్రం ప్రకటించింది, భారతదేశంలో అలా చేసిన మొదటి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది.