శ్రీలంక దివాళా.. కారణం చైనా.!
ఇండియాకు శ్రీలంకకు ఎంతో అనుబంధం ఉన్నది. మన పురాణాల్లో కూడా లంక ప్రస్తావన ఉన్న సంగతి తెలసిందే. పక్కనే ఆనుకొని ఉన్న పాకిస్తాన్ మనకు శత్రుదేశం అయినా.. శ్రీలంక మాత్రం ఎప్పటికీ మిత్రదేశంగానే ఉన్నది. ఆ దేశ అంతర్గత సమస్యల్లో మన ప్రభుత్వాలు గతంలో సహాయం చేశాయి. కానీ ఇప్పుడు మాత్రం శ్రీలంకతో ఇండియా కాస్త దూరమే పాటిస్తున్నది.
ఇప్పుడు శ్రీలంక గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్నది. పర్యాటకంపైనే ఆధారపడిన శ్రీలంకను ఉగ్రవాదులు బాంబు దాడులు, కరోనా కోలుకోలేని దెబ్బ తీసింది. విదేశీ నిల్వలు ఆవిరి అయిపోవడంతో పూర్తిగా ఆహార, ఆర్థిక సంక్షోభంలోకి కూరుకొని పోయింది. ఇతర దేశాల నుంచి అప్పులు పుట్టడం లేదు. అంతే కాకుండా ఐఎంఎఫ్ ఆంక్షలతో శ్రీలంక తీవ్రంగా సతమతం అవుతున్నది.
కనీసం పేపర్ కొనే పరిస్థితి కూడా లేకపోవడంతో పరీక్షలు వాయిదా వేశారంటే లంకలో ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు. దీనంతటికీ కారణం చైనానే అని ఆర్థిక విశ్లేషకులు బాహాటంగానే కామెంట్లు చేస్తున్నారు.
శ్రీలంకను పాలిస్తున్న రాజకీయ నాయకులు కొన్నేళ్లుగా ఇండియాను దూరం పెట్టి చైనాకు దగ్గరయ్యారు. జల రవాణాకు శ్రీలంక పనికి వస్తుందనే ఆశతో చైనా ఆ దేశాన్ని వాడుకున్నది. భారీ వడ్డీ రేట్లతో చైనా అప్పులు ఇచ్చింది. ఇప్పుడు కొత్త అప్పు ఇవ్వాలని కోరగా చైనా మొహం చాటేసింది. చైనాతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాశ్చాత్య దేశాలు కూడా శ్రీలంకను దూరం పెట్టాయి.
ఈ సమయంలో ఇండియా మరోసారి శ్రీలంకకు మద్దతుగా నిలిచింది. కొత్తగా రూ. 7643 కోట్ల సాయం చేసింది. గతంలో ఇండియా ఇచ్చిన 90 కోట్ల డాలర్ల రుణాల చెల్లింపును కూడా వాయిదా వేసి ఆదుకున్నది. కానీ లంకలో పరిస్థితులు మాత్రం ఇప్పట్లో చక్కబడేలా లేవు. అనేక మంది ప్రజలు అక్కడ బతకలేక ఇండియాకు వలస వస్తున్నారు.