డెల్టాక్రాన్ ప్రమాదకరమా? ఫోర్త్‌వేవ్ తీవ్రంగా ఉండబోతోందా?
కరోనా మహమ్మారి మొదలై రెండేళ్లు దాటినా.. తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. అంతమనేది లేకుండా రోజుకో కొత్త రూపంలో ప్రపంచంపై దాడి చేస్తుంది. ఇప్పటికే ఆల్ఫా, డెల్టా, బీటా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు విజృంభించి, అతలాకుతలం చేశాయి.

గత సంవత్సరం దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ మిగతా వాటికంటే వేగంగా వ్యాపించింది. ఆరోగ్యం మీద దీని తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు మాత్రం రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. మళ్లీ ఇప్పుడు బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వేరియంట్‌ను గుర్తించారు సైటిస్టులు.
డెల్టా.. ఒమిక్రాన్ ఈ రెండు రకాలను పోలిన లక్షణాలు కనిపిస్తుండడంతో దీన్ని డెల్టాక్రాన్‌గా పిలుస్తున్నారు. దీనిని సైప్రస్ పరిశోధకులు గత నెలలో తొలిసారి గుర్తించారు. అయితే, ల్యాబ్‌లో సాంకేతిక తప్పిదం జరిగిందని శాస్త్రవేత్తలు భావించారు. ఇప్పుడు ఇదే వేరియంట్‌కు సంబంధించిన కేసులు బ్రిటన్‌లో నమోదవుతున్నాయి.
ఈ వేరియంట్ వ్యాప్తిపై బ్రిటన్‌కు చెందిన యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ దృష్టి సారించింది. ఇప్పటికే వెలుగు చూసిన డేల్టా, ఒమిక్రాన్ వేరియంట్లను ‘వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. అయితే, డెల్టాక్రాన్ వేరియంట్ తీవ్రత, దాని వ్యాప్తి వేగంపై అధికారిక ప్రకటనలేవీ లేవు.

ఇన్ఫెక్షన్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదీ, లక్షణాల తీవ్రత గురించి మాత్రం వివరాలు వెల్లడించలేదు. అయితే ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలకే పరిమితమైనప్పటికి. డెల్టాక్రాన్ మాత్రం మునుపటి వేరియంట్ల మాదిరిగా అంత ప్రభావం చూపించకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.
కానీ, సైప్రస్ లో డెల్టాక్రాన్‌ను గుర్తించిన సైటిస్టులు డెల్టా, ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తిస్తుందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మాత్రం ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి ప్రశాంతంగా ఉండాలని చెబుతున్నాయి.
డబ్ల్యుహెచ్ఓ, అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) రెండూ, డెల్టాక్రాన్‌ను ఇప్పటివరకూ ఆందోళనకరమైన వేరియంట్‌గా చెప్పలేదు. డబ్ల్యుహెచ్ఓ ప్రస్తుతం దీనిని పరిశీలనలో ఉన్న వేరియంట్‌గా చెప్పింది. ఈ వేరియంట్‌కు సంబంధించి జరిగిన అధ్యయనాల్లో వ్యాధి తీవ్రతకు సంబంధించి ఎలాంటి మార్పులనూ తాము గమనించలేదని కోవిడ్-19 డబ్ల్యుహెచ్ఓ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ మార్చి 9న ఒక మీడియా సమావేశంలో చెప్పారు.