నిరుద్యోగులకు శుభవార్త.. 80039 పోస్టులకు నేటి నుంచే నోటిఫికేషన్లను.. ఏ శాఖలో ఎన్ని ఖాళీలంటే..
‘రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీ చూడండి’ అని సీఎం కేసీఆర్ వనపర్తి సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ముందే చెప్పినట్లు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఏపీతో ఉన్న ఉద్యోగుల వివాదం ముగియడంతో పాటు రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉద్యోగుల విభజన అనంతరం మొత్తం 91142 ఖాళీలు ఏర్పడినట్లు సీఎం ప్రకటించారు. కాగా, గత కొన్నేళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పరి చేస్తున్న 11103 మందిని రెగ్యులరైజ్ చేస్తున్నామని.. దీంతో మిగిలిన 80039 ఖాళీలకు బుధవారం నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ సభా ముఖంగా ప్రకటించారు. ఈ నోటిఫికేషన్లలో అత్యధికంగా దాదాపు 30 వేల ఖాళీలు విద్యారంగంలో భర్తీ కానున్నట్లు ఆయన చెప్పారు.
అంతకు ముందు కేసీఆర్ అసెంబ్లీలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ సమాజం పడిన గోసను మరోసారి గుర్తు చేశారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పెట్టిన కొర్రీలను ఎండగట్టారు. కొత్త జిల్లాలు, జోన్లను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా ఎలా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామో చెప్పుకొచ్చారు.

తెలంగాణ నిరుద్యోగులు నిరాశతో ఉండకూడదని.. త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. షెడ్యూల్ 9, 10 కి సంబంధించిన వివాదాలు కూడా పరిష్కారం అయ్యాక.. మరో 10 నుంచి 12 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా బుధవారం 10 గంటలకు కేసీఆర్ అన్నట్లుగానే నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.