ఎన్నికల పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పవన్.. ఇదే వ్యూహం
జనసేన పార్టీ 2024తో తప్పకుండా ఏపీలో అధికారాన్ని చేపడుతుందని.. అందుకు అవసరమైన వ్యూహాలను సిద్దం చేశామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా ఇప్పటంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో పవన్ అశేష అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పవన్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టడుతూనే వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం గత రెండున్నర ఏళ్లుగా ఎలా పాలించిందో రాష్ట్ర ప్రజలందరూ గమనించారని పవన్ అన్నారు. కూల్చివేతలతో ప్రారంభించిన ఈ ప్రభుత్వం ఇప్పటికీ విధ్వంసమే సృష్టిస్తున్నదని దుయ్యబట్టారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కలసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు కనుక రోడ్ మ్యాప్ ఇస్తే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి పని చేస్తామని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా అందరం కలపి పని చేస్తామని.. భవిష్యత్లో పొత్తుల గురించి స్పష్టం చేస్తామని చెప్పారు. పవన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. వైసీపీని ఒంటరి చేయడానికి మరోసారి బీజేపీ, టీడీపీలతో జనసేన జట్టు కట్టబోతుందని పవన్ చెప్పినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
జనసేన కనుక అధికారంలోకి వస్తే అప్పుల్లేని రాష్ట్రంగా మారుస్తామని.. అందుకోసం షణ్ముఖ వ్యూహం అనుసరిస్తామని అన్నారు. 2014లో ఆరుగురు కార్యవర్గం, 150 మంది క్రియాశీల కార్యకర్తలతో పార్టీ ప్రారంభమైందని.. 7 శాతం ఓటు బ్యాంకు నుంచి 27 శాతానికి చేరుకున్నామని పవన్ చెప్పారు.