పవన్‌కు అంత ధీమా ఎందుకు? వైసీపీని ఓడించడం అంత ఈజీనా?
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని తర్వాత ఎన్నికలకు రాజకీయ నాయకులు సిద్దపడుతుంటారు. ఎనిమిదేళ్ల క్రితం జనసేన పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. కేవలం రాజోలు సీటు మాత్రమే గెలుచుకున్నా,.. ఆ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జనసేన పార్టీకి దూరమయ్యాడు. ఇప్పటికి రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా.. జనసేన పార్టీ సాధించింది ఏమీ లేదు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికిన జనసేనాని.. 2019 ఎన్నికల్లో పోటీ చేసి.. వైసీపీకి వ్యతిరేకంగా కూటమిని కట్టారు. దీంతో ప్రజలు అతడిని, అతని పార్టీని కనీసం పట్టించుకోలేదు.
ఇంత జరిగినా పవన్ కల్యాణ్ తన ధీమాను మాత్రం కోల్పోకుండా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమే టార్గెట్ అంటూ వ్యాఖ్యానించారు. తాను రాబోయే ఎన్నికల్లో ఏం చేయబోతున్నాడో కూడా స్పష్టం చేశాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చబోమని తేల్చి చెప్పాడు. మంగళవారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తాను వైసీపీ ఓటును చీల్చబోమని చెప్పింది సరదా కోసం కాదని.. పూర్తిగా ఆలోచించే చెప్పానని మరోసారి స్పష్టం చేశారు.
ఎంత గింజుకున్నా, కొట్టుకున్న 2024లో వైసీపీ అధికారంలోకి రాదని జనసేనాని ధీమా వెనుక కారణం ఏమిటి? వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడం అంత ఈజీనా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ధీమా మొదటి నుంచి తన ఓటు బ్యాంకు కానేకాదు. కేవలం టీడీపీ, బీజేపీ మాత్రమే నన్నది బహిరంగ రహస్యమే. మొదటి నుంచి ఈ రెండు పార్టీల కొమ్ము కాస్తున్న పవన్.. వచ్చే ఎన్నికల్లో కూడా వారితో పొత్తు పెట్టుకోవడం ఖాయమే. అయితే ప్రస్తుతం ఆ రెండు పార్టీలను ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో అయితే లేరు. కేంద్రంలో బీజేపీ గ్రాఫ్ తగ్గకపోయినా.. ఏపీలో మాత్రం గత ఎన్నికల తర్వాత పెద్దగా పుంజుకున్నది లేదు.
టీడీపీ పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకొని వచ్చేందుకు నారా లోకేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉన్నది. వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ప్రజలకు కాస్త అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. కానీ దాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడలో పవన్ కల్యాణ్ కానీ.. చంద్రబాబు కానీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. చంద్రబాబు అయితే ఈ మధ్య కనీసం హైదరాబాద్ దాటి సొంత రాష్ట్రానికి రావడం లేదు.
కొత్త జిల్లాలపై పవన్ చేసిన వ్యాఖ్యలు అతడికే రివర్స్ కొట్టాయి. తాము అధికారంలోకి వస్తే జిల్లాలను మారుస్తామని చెప్పడం ప్రజల్లో నవ్వులపాలయ్యింది. నిన్నమొన్నటి వరకు రాజధాని ఎలా మారుస్తారని వైసీపీపై విరుచుకపడిన పవన్.. ఇప్పుడు జిల్లాలు మారుస్తా అనడం డబుల్ స్టాండర్డ్ లాగా మారిపోయింది. అడపాదడపా ప్రజల్లో తిరుగుతున్నా.. పవన్ ధీమా మాత్రం ఓటర్లు కాదని.. కేవలం బీజేపీ, టీడీపీ పార్టీలే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం వైసీపీని ఓడించడం అంత సులభమేమీ కాదని అంటున్నారు.