భగవంత్ మన్… కమేడియన్ నుంచి సీఎం కుర్చీ వరకు..
పంజాబ్ ఎన్నికల్లో బలమైన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 86 సీట్లను గెలిచి ఆరింటిలో ఆధిక్యంలో ఉన్నది. ఇది ఆప్‌కు భారీ విజయమనే చెప్పాలి. ఈ కేవలం పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కృషి మాత్రమే కాదు. పంజాబ్ ఓటర్లను ఆప్ వైపు తిప్పిన మరో కీలక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయనే భగవంత్ మన్. పంజాబ్ ఎన్నికలకు ముందే ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ జనవరి 19న భగవంత్ మన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు. ఫోన్ ద్వారా నిర్వహించిన పోల్‌లో 21.5 లక్షల మంది పాల్గొనగా.. వారిలో 93 శాతం మంది మన్ను సీఎం అభ్యర్ధిగా ఓకే చేశారు. ఆ తర్వాతే కేజ్రీవాల్ అతడిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు.
భగవంత్ మన్.. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని సతోజ్ గ్రామంలో 1973 అక్టోబర్ 17న జన్మించాడు. చిన్నప్పటి నుంచే చాలా చలాకీగా ఉండే మన్.. పాఠశాల స్థాయి నుంచే కామెడీ స్కిట్స్ చేస్తూ స్టాండప్ కమేడియన్‌గా ఎదిగాడు. ఇంటర్ కాలేజ్ కామెడీ ఫెస్టివెల్స్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకున్నాడు. గ్రాడుయేషన్ తర్వాత పంజాబీ టీవీ చానల్స్‌లో స్టాండప్ కమేడియన్‌గా మంచి గుర్తింపు పొందాడు. రాజకీయాలు, బిజినెస్, స్పోర్ట్స్ వంటి అంశాల్లో మంచి కామెడీ చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. స్టార్ ప్లస్‌లో వచ్చిన ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్’లో పాల్గొన్న తర్వాత అతడికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
2011లో మన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఏడాదే పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2012లో జరిగిన ఎన్నికల్లో లెహ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి సంగ్రూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచాడు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జలాలాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తిరిగి ఎంపీగా గెలుపొందాడు. పార్లమెంట్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ భగవంత్ మన్ కావడం విశేషం.
ఆప్ అధినేత కేజ్రీవాల్ అతడిని ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటించిన వెంటనే కదనరంగంలోకి దూకాడు. స్వాతంత్ర సమరయోధులు ధరించే పసుపు రంగు పగడి ధరించి బహిరంగ సభల్లో పాల్గొనేవాడు. పదే పదే భగత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ ‘అసలైన పంజాబ్‌ను తిరిగి తెచ్చుకుందాం’ అంటూ నినదించాడు. అతడి ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ధురి నియోజకవర్గం నుంచి అతడు తొలి సారిగా పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
ఒక స్కూల్ టీచర్ కొడుకైన మన్.. 18 ఏళ్ల వయసులో తన స్టాండప్ కామెడీని క్యాసెట్లో విడుదల చేసి పంజాబ్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే కమేడియన్.. 49 ఏళ్ల వయసులో పంజాబ్ ప్రజల మనసును గెలుచుకున్నాడు.
ఆప్ ఘనవిజయం సాధించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మన్.. పంజాబ్ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పాడు. తాను రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనని.. భగత్ సింగ్ పూర్వికుల ఊరైన ఖాత్కర్ కలాన్ గ్రామంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపాడు.