అట్టుంటది ఈ కాంగ్రెస్ నాయకులతోని ముచ్చట..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ఎంత కీలకంగా వ్యవహరించిందో అందరికీ తెలిసిన విషయమే. సోనియా గాంధీ చొరవతోనే రాష్ట్రం ఏర్పడినట్లు స్వయంగా కేసీఆర్ కూడా చెప్పాడు. కానీ కొత్త రాష్ట్రంలో రెండు సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. ఒక విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేకుండా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ను తొక్కిపెడితే.. అదే అదునుగా చూసుకొని బీజేపీ బలపడుతున్నది.
ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటికీ రాష్ట్రంలో బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీకి సరైన దిశానిర్దేశం లేకపోవడంతో సీట్లు గెలవలేకపోతున్నది. రాష్ట్ర బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించిన తర్వాత కాస్త దూకుడుగా వెళ్తుందని అధిష్టానం భావించింది. కానీ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సీతక్క, మల్లు భట్టివిక్రమార్క వంటి నాయకులు తప్ప ఎవరూ జనాల్లో కనపడం లేదు. ప్రతీరోజు మీడియాకు తమ కొట్లాటలను ఏకరవు పెట్టడానికి తప్ప ఒక్కరూ ప్రజాసమస్యలపై మాట్లాడే వారే కరువయ్యారు.
రాష్ట్ర కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఎక్కువ కావడంతో స్వయంగా రాహుల్ గాంధీ అందరినీ పిలిచి మాట్లాడాడు. సోమవారం ఢిల్లీలో సీనియర్ నాయకులందరినీ పిలిచి ముచ్చటపెట్టాడు. అందరూ విభేదాలు వీడి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని సూచించాడు. పార్టీలో కొట్లాడుకోవడం మాని.. అధికారంలోకి రావడానికి అందరూ కలసి టీఆర్ఎస్, బీజేపీలపై కొట్లాడాలని అన్నాడు. ఇగోలతో ఒకరిని ఒకరు నిందించుకొని పార్టీ పరువు తియ్యవద్దని కాస్త గట్టిగానే క్లాస్ పీకాడు. పరిష్కారం కాని సమస్యలు ఉంటే.. వాటిని అధిష్టానం చూసుకుంటుంది. కానీ మీరు మాత్రం రచ్చకు ఎక్కొద్దని గట్టిగానే చెప్పాడు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి సీనియర్లు ఈ భేటీలో ఉన్నారు. అయితే మీటింగ్ ముగిసిన తర్వాత కోమటిరెడ్డి కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా అలిగి వెళ్లిపోయాడు. రాహుల్ అంతగనం నెత్తినోరు కొట్టుకొని చెప్పి పది నిమిషాలు కాకకుందే.. కాంగ్రెస్ నాయకులు ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సొంత నాయకులే బలిపెడితున్నారని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎంత సేపూ పదవుల లొల్లే గాని.. ప్రజల్లోకి వెళ్లాలనే సోయిలేకుండా పోతోంది. మరి వీళ్లను బాగుచేయాలంటే ఎవరో దిగిరావాల్సిందే. అట్టుంటది మరి కాంగ్రెసోళ్లతోని ముచ్చట.