రష్యా-ఉక్రేయిన్ సైబర్ యుద్దం: ఇది ప్రపంచానికే ప్రమాదకరం కావొచ్చు
రష్యా ఉక్రేయిన్ మధ్య జరుగుతున్న యుద్దం పదకొండో రోజుకి చేరుకుంది. రష్యా చేస్తున్న దాడులను తిప్పికొట్టటానికి ఉక్రెయిన్ తన సర్వ శక్తులనూ ఒడ్డుతోంది. ఎదురు దాడిలో భాగంగానే ఉక్రెయిన్ ఇప్పుడు సైబర్ దాడులకూ దిగింది.
నేల, నింగి, నీరుపై మాత్రమే కాకుండా ఇప్పుడు యుద్ధం, అన్నింటికన్నా ప్రధానంగా సైబర్ స్పేస్‌లో నడుస్తోంది. యుక్రెయినియన్ సైబర్ నెట్‌వర్క్‌ల మీద ఆక్రమణలు, దాడులు ఎప్పుడూ లేనంతగా ఎక్కువైపోయాయి. ఈ ముప్పు కేవలం ఉక్రెయిన్‌కు మాత్రమే పరిమితం కాబోదని సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుల మాట.
రష్యా ఐటీ వ్యవస్థను మరింత ఛిన్నాభిన్నం చేసేందుకు ఉక్రెయిన్ సైబర్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఉక్రెయిన్‌లోని ఐటీ నిపుణులందరినీ ఓ చోట చేర్చి డిజిటల్ ఆర్మీగా ఏర్పాటు చేసింది. వీరంతా రష్యాకు సంబంధించిన ఐటీ వ్యవస్థపై సైబర్ దాడులు చేస్తున్నారు.
ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్ స్వచ్ఛంద సైబర్ ఆర్మీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఉక్రెయిన్‌లో ఎంతో మంది ఐటీ నిపుణులు ఉన్నారని, వీరంతా.. దేశ రక్ష కోసం ఆయుధం చేతపట్టకుండా సైబర్ వేదికగా రష్యాపై దాడికి దిగుతున్నారని ప్రకటించారు.
మరోవైపు తమ ప్రభుత్వంతోపాటు క్రెమ్లిన్, డూమా, రక్షణశాఖ వెబ్సైట్లు సైబర్ దాడికి ప్రభావితమైనట్లు రష్యా ప్రభుత్వ టెలివిజన్ నెట్వర్క్ ఆర్టీ ధ్రువీకరించింది.
కొన్ని వెబ్సైట్లు నెమ్మదించగా, మరికొన్ని ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయని పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పెద్ద ఎత్తున బాంబు దాడులకు రష్యా సాయుధ బలగాలు సిద్ధమవుతున్నట్లు ‘అనానమస్’ ఇటీవల ట్విట్టర్లో వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
అయితే రష్యాకూడా ఈ డిజిటల్ యుద్దాన్ని బలంగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రష్యన్ హ్యాకర్ల దాడికి ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్మీ వెబ్సైట్లు పనిచేయకుండా పోయాయి. దేశంలోని రెండు అతి పెద్ద జాతీయ బ్యాంకులు కస్టమర్లకు అందుబాటులో లేకుండా పోయాయి. పక్క దేశాల నెంబర్ల నుంచి లక్షలాది ప్రజలకు ఫేక్ న్యూస్‌లు అందాయి.
ఈ సైబర్ ఆర్మీ ప్రపంచంలోని పలు ప్రాంతాలనుంచి కూడా పని చేస్తోంది. ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో రష్యా ఆర్మీ మోహరించి ఉన్న ఫొటోలు, వారి కదలికలు, ఆయుధ సామాగ్రి వంటి కీలక అంశాలను సేకరించి, ఉక్రెయిన్ ఆర్మీకి చేరుస్తున్నారు.
అంతే కాదు ఏకంగా రష్యాలోని మీడియా, రైల్వేలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ సైబర్ ఆర్మీ దాడి చేస్తున్నది. రష్యా బ్యాంకింగ్ వ్యవస్థను కూడా హ్యాక్ చేసినట్టు తెలిపింది. కొన్ని గంటల పాటు రైలు టికెట్ల జారీ వ్యవస్థను కూడా పని చేయకుండా చేశారు. టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం కలిగించామని ఉక్రెయిన్ సైబర్ ఆర్మీ ప్రకటించింది.
అయితే రష్యా సైబర్ స్పేస్ దాడులను మాత్రం తాము నిరోధిస్తున్నామని, రష్యా కూడా ఉక్రెయిన్‌పై సైబర్ దాడులకు దిగుతున్నది. ఉక్రెయిన్ వెబ్సైట్లను హ్యాక్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందకుండా చేస్తిఓంది. అయితే ఈ రెండు దేశాల డిజిటల్ యుద్ధంతో ఆ రెండు దేశాలే కాక మిగతా యూరప్ దేశాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.