వందో టెస్టుకు ముందు కోహ్లీకి సర్ప్రైజ్..
భారత జట్టు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఇవాళ తన వందో టెస్టు ఆడుతున్నాడు. మొహలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ ఆడటం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. భారత్ తరపున 100 టెస్టులు ఆడిన 12వ క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో జరిగిన చిన్న కార్యక్రమంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి ప్రత్యేక జ్ఞాపికతో పాటు 100వ టెస్టు క్యాప్ అందించాడు. ఈ సందర్భంగా కోహ్లీ జట్టు సహచరులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. తన చిన్ననాటి హీరోలలో ఒకరైన ద్రవిడ్ నుంచి ఈ క్యాప్ అందుకోవడం ఆనందంగా ఉందన్నాడు. తనకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ.. తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 45 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో కోహ్లీ టెస్టుల్లో 8వేల పరుగుల మైలు రాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్గా రికార్డులకు ఎక్కాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండుల్కర్ (15921), రాహుల్ ద్రవిడ్ (13265), సునిల్ గవాస్కర్ (10122), వీవీఎస్ లక్ష్మణ్ (8781), వీరేందర్ సెహ్వాగ్ (8503) ఉన్నాడు. విరాట్ కోహ్లీకి 8వేల పరుగుల క్లబ్లో చేరడానికి 169 ఇన్నింగ్స్ పట్టింది. సచిన్ టెండుల్కర్ 154, ద్రవిడ్ 157, సెహ్వాగ్ 160, గవాస్కర్ 166, లక్ష్మణ్ 201 ఇన్నింగ్స్ ఆడారు.