ఐపీఎల్ హక్కుల కోసం జెఫ్ బెజోస్ – ముఖేశ్ అంబానీ మధ్య పోటీ.. బీసీసీఐ టార్గెట్ రూ. 50వేల కోట్లు
నువ్వా నేనా అంటున్న ప్రైమ్ వీడియ్ – వయాకామ్ 18
రంగంలోకి డిస్నీ స్టార్ ఇండియా, సోనీ, జీ
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరుంది. క్రికెట్ పెద్దన్న ఐసీసీ అని పేరుకే గానీ.. క్రికెట్‌ను శాసించేసి బీసీసీఐ. అందుకు కారణం కేవలం టీమ్ ఇండియా మాత్రమే కాదు. బీసీసీఐ ఖజానాలోకి చేరుతున్న వేలాది కోట్ల రూపాయలు కూడా. భారత జట్టు మ్యాచ్ ఆడితే టీవీల్లో వచ్చే రేటింగ్స్ మామూలుగా ఉండవు. అందుకే ఐసీసీ ఈవెంట్లలో కూడా భారత జట్టు మ్యాచ్‌లను సెలవు రోజులు, ప్రైం టైమ్ అని ఫిక్స్ చేస్తుంటారు. ఇదంతా ఒక వైపు అయితే.. ఐపీఎల్ ముచ్చట అలగ్ ఉంటది.
బీసీసీఐ ఖాజానాలో చేరుతున్న డబ్బులో సింహభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచే వస్తుంది. పాపులారిటీ, వాల్యూ పరంగా మరే ఇతర క్రికెట్ లీగ్ ఐపీఎల్ దరిదాపుల్లో ఉండదు. ఆటగాళ్లకు ఇచ్చే జీతాల నుంచి టీవీ హక్కుల అమ్మకాల వరకు ఐపీఎల్‌కు తిరుగులేదు. ప్రస్తుతం ఐపీఎల్ ప్రసార హక్కులు స్టార్ ఇండియా దగ్గర ఉన్నాయి. ఐదేళ్ల క్రితం జరిగిన వేలం పాటలో రూ. 16,347.5 కోట్లకు టీవీ, డిజిటల్, రేడియో, ఓటీటీ హక్కులు కొనేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్‌తో దాని గడువు ముగిసిపోతుంది. దీంతో కొత్తగా మళ్లీ మీడియా హక్కుల కోసం బీసీసీఐ టెండర్లు పిలిచింది.
గతంలో గంపగుత్తగా కాకుండా.. ఈ సారి నాలుగు వేర్వేరు ప్యాకేజీలుగా హక్కులు అమ్మడానికి రెడీ అయ్యింది. టీవీ, ఓటీటీ హక్కులను వేర్వేరుగా అమ్మాలని బీసీసీఐ నిర్ణయించిది. అన్ని ప్యాకేజీలు కలిపి బేస్ ప్రైజ్ రూ. 33 వేల కోట్లుగా ఫిక్స్ చేసింది. ఈ-ఆక్షన్ పద్దతి ద్వారా వేలం వేయనుండటంతో బీసీసీఐకి దీని ద్వారా కనీసం రూ. 50వేల కోట్లు సమకూరుతాయని విశ్లేషకుల అంచనా.
గతంలో బీసీసీఐ మీడియా హక్కుల కోసం స్టార్ ఇండియా, సోనీ, జీ టీవీ వంటి మీడియా సంస్థలు మాత్రమే పోటీ పడేవి. కానీ ఈ సారి బడా కంపెనీలు హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచలోనే టాప్ బిలియనీర్స్ అయిన జెఫ్ బెజోస్, ముఖేశ్ అంబానీ ఈ సారి ఐపీఎల్ హక్కుల కోసం రంగంలోకి దిగుతున్నారు.
జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ ప్రైమ్ వీడియ్, ముఖేష్ అంబానీకి చెందిన వయాకామ్ 18 ఐపీఎల్ హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రైమ్ వీడియో ఇప్పటికే ఇండియాలో చాలా పాపులర్ ఓటీటీ సర్వీస్. క్రికెట్ లైవ్ ప్రసారాలు కూడా ప్రైమ్ వీడియోలో వస్తున్నాయి. అయితే ఐపీఎల్ హక్కులు దక్కించుకోవడం ద్వారా సబ్స్క్రైబర్స్ బేస్ మరింతగా పెంచుకోవాలని భావిస్తున్నది. ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ ద్వారా లైవ్ ప్రసారాలు చేస్తోంది. స్టార్ ఇండియా గతంలో టీవీ, ఓటీటీ, డిజిటల్ హక్కులను గంపగుత్తగా పొందింది. కానీ ఈ సారి వేర్వేరుగా బిడ్స్ వేయాల్సి రావడంతో హాట్ స్టార్‌కు గట్టి పోటీ ఎదురు కానున్నది.
జెఫ్ బిజోస్, ముఖేశ్ అంబానీలు కనుక రంగంలోకి దిగితే బీసీసీఐ అనుకునే రూ. 50 వేల టార్గెట్ ఈజీగా దాటేస్టుందని విశ్లేషకుల అంచనా. ఈ మూడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మాత్రమే కాకుండా సోనీ లివ్, జీ5 కూడా పోటీలో ఉండే అవకాశం ఉన్నది.
ఇక టీవీ ప్రసార హక్కుల కోసం స్టార్ ఇండియా, సోనీ పిక్చర్స్ నెట్వర్క్, జీ ఇండియా పోటీపడతాయి. వీటికి తోడు అంబానీకి చెందిన వయాకామ్ 18 బరిలోకి ఉండబోతున్నది.
మే 10లోపు మీడియా హక్కుల కోసం ఐటీటీ దాఖలు చేయాల్సి ఉన్నది. జూన్12న ఈ-ఆక్షన్ పద్దతిలో వేలం నిర్వహించే అవకాశం ఉన్నది.
ఇవే ప్యాకేజీలు:
బండెల్ ఏ : ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో బ్రాడ్కాస్ట్ హక్కుల కోసం ఈ ప్యాకేజీ. ఒక్కో మ్యాచ్‌కు కనీసం రూ. 49 కోట్లు అంటే మొత్తం 74 మ్యాచ్‌లకు ఐదేండ్లకు రూ. 18,130 కోట్లను కనీస ధరగా నిర్ణయించారు.
బండెల్ బీ: ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో డిజిటల్ హక్కుల కోసం ఈ ప్యాకేజీ. ఒక్కో మ్యాచ్‌కు రూ. 33 కోట్ల చొప్పున ఐదేండ్లకు రూ. 12,210 కోట్లను కనీస ధరగా నిర్ణయించారు.
బండెల్ సి: ఇది నాన్-ఎక్స్‌క్లూసీవ్ ప్యాకేజీ. ఇందులో 18 మ్యాచ్‌లు డిజిటల్ పద్దతిలో ప్రసారం చేసుకోవడానికి వీలుంటుంది. ఓపెనింగ్ మ్యాచ్, డబుల్ హెడర్ మ్యాచ్‌లలోని ఈవినింగ్ మ్యాచ్, ప్లేఆఫ్స్, ఫైనల్స్ ప్రసారం చేసుకోవచ్చు. ఒక్కో గేమ్‌కు రూ. 16 కోట్ల చొప్పున ఐదేండ్లకు గాను రూ. 1440 కోట్లుగా ధర నిర్ణయించారు.
బండెల్ డి: సబ్ కాంటినెంట్‌కు అవతల (రెస్టాఫ్ ది వరల్డ్) కోసం ఒక్కో మ్యాచ్ కనీస ధర రూ. 3 కోట్లుగా నిర్ణయించారు. ఐదేండ్లకు గాను రూ. 1110 వాల్యూ ఉంటుంది.