క్రికెట్లో కొత్త రూల్స్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎంసీసీ
జెంటిల్మన్ గేమ్ క్రికెట్‌ను మరింత స్పూర్తిదాయకంగా తీర్చి దిద్దడానికి లండన్‌లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కసరత్తు చేస్తుంటుంది. క్రికెట్‌కు సంబంధించిన చట్టాలను, నియమాలను రూపొందించి.. వాటని సంరక్షించే బాధ్యత ఎంసీసీదే. ఈ క్లబ్ రూపొందించే చట్టాలనే ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమలు చేస్తుంది. ప్రస్తుతం క్రికెట్లో అమలు అవుతున్న రూల్స్ అన్నీ ఎంసీసీ రూపొందించినవే. తాజాగా ఎంసీసీ మరికొన్ని నిబంధనలను చేర్చింది. ఈ తాజా సవరణలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆ నిబంధనలు ఇవే..
- బౌలర్ బంతిని విసరక ముందే నాన్ స్ట్రైకర్ క్రీజ్ దాటితే అవుట్ చేయడాన్ని గతంలో మన్కడింగ్‌గా వ్యవహరించే వాళ్లు. ఎంసీసీ రూల్ బుక్‌లో గతంలో దీన్ని అన్యాయమైన అవుట్‌గా పేర్కొన్నారు. తాజా సవరణ ప్రకారం ఎంసీసీ చట్టంలోని 41 నుంచి 38కి మార్చారు. ఇకపై దీన్ని అధికారికంగా రనౌట్‌గా పరిగణిస్తారు.
- కరోనా కారణంగా ఎంసీసీ కొన్ని తాత్కాలిక నిబంధనలు రూపొందించింది. బంతికి ఉమ్మిని రాయడాన్ని నిషేధించడం ఇందులో ఒకటి. అయితే ఇకపై ఈ నిబంధనను శాశ్వతంగా ఉంచబోతున్నారు. బౌలర్లు, ఫీల్డర్లు ఇకపై బంతిపై ఉమ్మిని రాసి మెరుపును తెచ్చే ప్రయత్నం చేయడాన్ని శాశ్వతంగా నిషేధించారు. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే చట్ట విరుద్దమైన చర్యగా పరిగణించనున్నారు.
- ఒక ఓవర్లోని చివరి బంతికి తప్ప మిగతా ఏ బంతికైన ఆటగాడు క్యాచ్ అవుట్ అయితే.. తర్వాత వచ్చే బ్యాటరే స్ట్రైకింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో క్యాచ్ పట్టే సమయానికి హాఫ్ పిచ్ దాటితే నాన్ స్ట్రైకర్ బ్యాటింగ్ చేసే వాడు. ఇకపై అలా ఉండదు.
- బౌలర్ తన పూర్వ స్థితికి రాకముందు బ్యాటింగ్ చేసే ఆటగాడిని రనౌట్ చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. గతంలో దీన్ని నోబాల్‌గా ప్రకటించే వాళ్లు.
- బ్యాటర్ పిచ్‌ను దాటి పోయి బంతికి కొట్టడానికి వీలులేదు. బంతి దూరంగా పడినా పిచ్‌పై నుంచి మాత్రమే ఆడాలి. (వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బౌలర్ వేసిన ఒక బంతి పిచ్‌కు దూరంగా గడ్డిపై పడితే వార్నర్ దాన్ని సిక్స్ కొట్టాడు. ఇకపై అలాంటి బంతులను ఆడటానికి వీలులేదు)
- బ్యాటర్ బంతి విసిరిన తర్వాత పొజిషన్ మార్చుకుంటే ప్రస్తుతం దూరంగా వెళ్లిన బంతికి వైడ్ ఇవ్వడం లేదు. కానీ ఇకపై బౌలర్ రనప్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాటర్ ఎక్కడ ఉన్నాడో.. దాన్నే పరిగణలోకి తీసుకొని వైడ్ ఇవ్వనున్నారు. బ్యాటర్ పొజిషన్ మార్చుకున్నా ఇబ్బంది ఉండదు.
- బౌలర్లు కావాలని బ్యాటర్లు పిచ్ దాటి ఆడేలా బంతులు విసిరితే దాన్ని నోబాల్‌గా ప్రకటించనున్నారు.
- ఏదైనా జంతువు, పక్షలు, ప్రేక్షకుల వల్ల ఆటకు అంతరాయం కలిగితే ఆ సమయంలో విసిరిన బంతిని డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు.
- బౌలర్లు బంతిని విరిసే సమయంలో ఫీల్డర్లు ఎక్కువగా కదిలితే ఇప్పటి వరకు దాన్ని డెడ్ బాల్‌గా అంపైర్లు ప్రకటిస్తున్నారు. కొత్త నిబందనల ప్రకారం ఇకపై ఫీల్డర్లు అలా చేస్తే బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు జత చేస్తారు.