గంగూలీ వర్సెస్ జై షా.. క్రికెట్లో అత్యున్నత పదవి కోసం నువ్వా నేనా..!
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, గౌరవ కార్యదర్శి జై షా కలసి బోర్డును నడిపిస్తున్నారు. టెక్నికల్‌గా వీళ్ల పదవీకాలం ముగిసినా.. గౌరవ పదవుల్లో కొనసాగుతున్నారు. కరోనా కష్టకాలంలో ఐపీఎల్ సజావుగా సాగేందుకు వీరిద్దరూ కలసి పని చేయడం వల్లే బీసీసీఐకి ఎలాంటి నష్టం లేకుండా బతికిపోయింది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ ఒక పదవి కోసం పోటీ పడనున్నారు.
ఐసీసీ చైర్మన్ పదవికి గంగూలీ, జై షా పోటీ పడనున్నట్లు టెలిగ్రాఫ్ అనే పత్రిక కథనం ప్రచురించింది. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీ కాలం త్వరలో ముగియనున్నది. ఆయనకు మరో రెండు పర్యాయాలు పని చేసేందుకు అవకాశం ఉన్నది. అయితే న్యూజీలాండ్‌కు చెందిన బార్క్లే ఈ పదవి పొడగింపుపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆక్లాండ్‌లో కమర్షియల్ లాయర్ అయిన బార్క్లే.. న్యూజీలాండ్, ఆస్ట్రేలియాల్లోని పెద్ద కంపెనీలకు పని చేస్తున్నాడు. తనకు ఉన్న కమిట్మెంట్స్ వల్లే ఐసీసీ పదవికి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తున్నది.
2023లో ప్రపంచ కప్ ఇండియాలోనే జరుగనున్నది. ఆ సమయంలో మనవాడే అత్యున్నత సీటులో ఉండాలని బీసీసీఐ భావిస్తున్నది. అయితే సౌరవ్ గంగూలీ, జై షా వేర్వేరుగా ఈ పదవికి పోటీ పడాలని అనుకుంటుండటంతో బీసీసీఐ ఎవరికి సపోర్ట్ చేస్తుందో అనే ఆసక్తి నెలకొన్నది. 2011లో ఇండియాలో వరల్డ్ కప్ జరిగినప్పుడు శరద్ పవార్ ఐసీసీ బాస్‌గా ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ అమలు చేయడానికి బీసీసీఐ సిద్దపడుతున్నది.
2022 నవంబర్‌లో బార్క్లే పదవీ కాలం ముగియనుండటంతో.. 2023 జనవరి లోపు కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నది. బార్క్లే గత ఎన్నికల్లో గెలవడానికి కూడా పరోక్షంగా బీసీసీఐనే కారణం. బోర్డుకు ఉన్న పలుకబడితో గంగూలీ, జై షాలో ఎవరో ఒకరు చైర్మన్ అవడం ఖాయమే. అయితే ఇప్పుడు ఇద్దరిలో ఎవరు డ్రాప్ అవుతారనేదే పెద్ద సమస్యగా మారింది.