యుద్దభూమిలో మరణించిన ఉక్రెయిన్ నటుడు
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ఉధృతి పెరుగుతూనే ఉంది. 14 రోజులుగా జరుగుతున్న యుద్దంలో ఇరు దేశాలకు చెందిన సైనికులు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇక సాధారణ ఉక్రేనియన్ పౌరుల మరణాలైతే లెక్కలు కూడా సరిగ్గా అందటం లేదు. ఉక్రెయిన్-రష్యా యుద్దం సందర్బంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమ దేశాన్ని శత్రు దేశం దాడుల నుంచి కాపాడే క్రమంలో తన దేశాన్ని రక్షించుకోవడానికి సాయుధ దళాలలో చేరిన 33 సంవత్సరాల ఉక్రేనియన్ నటుడు పాషా లీ, ఇర్పిన్ ప్రాంతంపై రష్యా జరిపిన దాడిలో మరణించాడు.
ఉక్రెయిన్‌లో పాషా లీ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు, పేరు తెచ్చుకున్నాడు. టీవీ కమర్షియల్‌తో కెరీర్ ప్రారంభించిన పాషా లీ 2006లో ‘స్టోల్న్యా’ సినిమాతో హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ‘మీటింగ్స్ ఆఫ్ క్లాస్మేట్స్’, ‘షాడో ఆఫ్ ది అన్‌ఫర్‌గాటెన్ యాన్సిస్టర్’ వంటి సినిమాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. మరోవైపు లీ.. గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
క్రిమియాలో జన్మించిన పాషా లీ ఉక్రెయిన్ సినిమాల్లో నటిస్తున్నాడు. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించడంతో ఉక్రెయిన్ ప్రజలు సైనికులు ఎక్కడికక్కడ రష్యా సేనలను ఎదుర్కోవాలని.. ఉత్సాహం ఉన్న వాళ్లంతా యుద్ధంలో చేరాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజధాని కీవ్ పై రష్యా సేనలు విరుచుకుపడుతుంటే.. మరింత ముందుకు రాకుండా ఉక్రెయిన్ సేనలతోపాటు ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు నావంతు పోరాడుతానని ముందుకొచ్చాడు పాషా లీ. ఇర్ఫిన్ నగర శివార్లలో ఉక్రెయిన్ సైన్యంతో కలసి విధులు నిర్వహిస్తున్నాడు.

ఒక ప్రాంతంలో విధుల్లో ఉండగా.. ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘గత 48 గంటలుగా ఇక్కడ డ్యూటీలో ఉన్న నాకు.. కాస్త ఫోటో తీయించుకునే విరామం దొరికింది.. ఉక్రెయిన్ మా దేశం.. మా దేశం కోసం మేం ఏమైనా చేయగలం.. అందుకే నవ్వుతున్నాం ’ అంటూ సైనిక దుస్తుల్లో ఫోటో దిగి ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు.
అయితే మార్చి 6న కీవ్‌లోని ఇర్పిన్ బాంబు దాడిలో పాషా లీ మరణించాడు. ఈ విషయాన్ని ఒడెస్సా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. పాషా లీ ఉక్రెయిన్‌లో పేరున్న నటుడు. ఎన్నో సినిమాల్లో నటించి ఉక్రెయిన్ ప్రజలకు దగ్గరయ్యాడు. అలాగే కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పాడు. హాలీవుడ్ సినిమాలు ది హాబిట్, ది లైన్ కింగ్ వంటి చిత్రాలకు తన గాత్రాన్ని అందించాడు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రారంభించాక పాషా లీ నటనను విడిచిపెట్టి. ఉక్రెయిన్‌లోని టెరిటోరియల్ ఢిఫెన్స్ యూనిట్లో చేరి తమ దేశ సైన్యానికి కీలక సూచనలు, సలహాలు ఇస్తూ వారికి ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో మార్చి 6వ తేదీన రష్యా దాడుల్లో ఆయన మృతి చెందినట్టు ఒడెస్సా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
పాషా లీ మరణించాడనే వార్త తెలియడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.