ఇంటిముందు బెల్స్, డ్రమ్స్ కొట్టండి: మోడీకి పేరడీ నిరసన
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, గ్యాస్ సిలిండర్ ధరలు అదుపులేకుండా పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా నాలుగో రోజైన శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 80 పైసల మేర పెరిగాయి. దీంతో ధరల పెంపుకు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంధన ధరల పెంపుతో ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దాదాపు 26 లక్షల కోట్లు అర్జించిందని కాంగ్రెస్ విమర్శించింది.

పెంపుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 31 న గురువారం ఉదయం 11 గంటలకు ప్రజలంతా తమ ఇళ్ల బయటకు, బహిరంగ ప్రదేశాలకు రావాలని, గ్యాస్ బండలకు పూల దండలు వేసి గంటలు, డ్రమ్స్, పళ్లాలు, ఇతర పరికరాలు మోగించాలని కోరింది.
కోవిడ్ మొదలైన సందర్భంగా ప్రధాని మోదీ అందరూ తమ ఇండ్లవద్ద చప్పట్లు కొట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. అప్పుడు మోదీ అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ప్రధాని నిర్ణయాలకు వ్యతిరేకంగా పాటించబోతుంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ‘మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్’ పేరుతో వారం రోజులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 7 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా. శనివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ చేపట్టబోయే కార్యక్రమాల్ని వివరించారు.