బాయ్ కాట్ ఆర్ఆర్ఆర్ : అభిమానుల ఆగ్రహానికి కారణం?
సోషల్ మీడియాలో కన్నడిగుల నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సినిమా రిలీజ్కు మరికొద్ది గంటల సమయమే ఉండగా, ఇప్పుడు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కర్ణాటక ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయడానికి వీల్లేదని విరుచుకుపడుతున్నారు. కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ బ్యాన్ అన్న హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.
అయితే ఇదేమీ ద్వేషంతోనో, పగతోనో చేస్తున్న గొడవకాదు. ప్రధాన కారణం ఆర్ఆర్ఆర్ కన్నడ భాషలో రిలీజ్ కాకపోవడమే. అంతటి ప్రతిష్టాత్మక సినిమాని మా భాషలో కూడా ఎందుకు విడుదల చేయరు? అన్నది కన్నడ ప్రేక్షకుల ప్రశ్న.
ఇటీవల కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ముఖ్య అతిథిగా వచ్చేసిన సంగతి తెలిసిందే. అలాంటి కర్ణాటకలో ఈ సినిమాను కేవలం తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడంపై కన్నడిగులు కాస్త కోపంగా ఉన్నారు.
ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలలో ఆర్ఆర్ఆర్ ఒకటి. ఈ చిత్రం ఈ వారం మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ విడుదల కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, కర్ణాటకలోని అభిమానులు మాత్రం నిరాశకు గురయ్యారు.
ఈ సినిమా కన్నడలో విడుదల కాకపోవడంపై అభిమానులు ట్విటర్ వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు ‘#BoycottRRRinKarnataka’ బుధవారం ట్విట్టర్లో టాప్ ట్రెండ్లలో ఒకటిగా నిలిచింది. మరి ఈ వివాదంపై ఆర్ఆర్ఆర్ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.