రాహుల్ గాంధీ గారూ! నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిలబడండి: ఎమ్మెల్సీ కవిత రిప్లై
తెలంగాణ రైతు సమస్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఖరిపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ.. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు అన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వార్ సాగుతోంది. ముఖ్యమంత్రితో పాటు టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారూ. కేంద్రం మాత్రం నిబంధనలకు తగ్గట్లే అన్ని రాష్ట్రాల్లోనూ కొనుగోళ్లు జరుగుతాయని, తెలంగాణ అందుకు మినహాయింపు ఏమాత్రం కాదని చెబుతోంది. ఇలా విమర్శలూ, ప్రతివిమర్శలూ జరుగుతూనే ఉన్నాయి.

ఇదే సమయంలో..‘తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ అఫీషియల్ ట్విటర్ పేజీ నుంచి తెలుగులో పోస్ట్ చేయటం గమనార్హం.

అయితే… అటు రాహుల్ ట్వీట్ వచ్చిన కొద్దిసేపట్లోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ గా రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలపడం సరి కాదని రాహుల్ గాంధీని ఉద్దేశించి. ట్వీటర్లోనే సమాధానం చెప్పారు.
టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారని, నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్లోకి వచ్చి నిరసన తెలపాలని, ఒక దేశం… ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయమని ట్వీట్ చేశారు కవిత.