పొయెట్రీ: కొరియన్ సినిమా
కొన్ని సార్లు మనం విచిత్రమైన స్థితిలో పడుతుంటాం. కొన్ని నిజాలే అని తెలుస్తున్నా ఒప్పుకోలేని తనం గందర గోళంలో పడేస్తుంది. సత్యాన్ని సత్యంగా ఒప్పుకోలేక పొవటమే జీవితంలోని సరళతను హరించి వేసిందేమో..! లేదంటే తమకు తామే తయారు చేసుకున్న సామాజిక జీవితంలో కూడా తమకు తామే కొన్ని రహస్యాలని దాచుకోవాల్సి వచ్చే స్వేచ్చలేని జీవితంలోకి ఎందుకు నెట్టబడతారు మనుషులు??
బహుశా ఈ విషయమే ఆమెకు అర్థం కాలేదు. అరవయ్యేళ్ల వయసులో కవిత్వం రాయాలనుకున్న ఆమె చివరిగా ఒకే ఒక్క కవిత కదూ రాసింది. తన చుట్టూ ఉన్న మనుషులమీద అసహ్యంతోనే ఆ నాలుగు వాక్యాలూ రాసేసి వెళ్లిపోయింది.

ఆమె పేరు మిజా. నాలుగిళ్లలో పాచి పని చేసుకొని మనవన్ని పోషించుకుంటోంది. అరవయ్యేళ్ల ఆ ముసలావిడ కవిత్వం రాయాలనుకుంది. మనవన్ని చదివించాలనుకుంది. కవిత్వం నేర్పే వర్క్ షాప్ లో జాయిన్ అయ్యింది కూడా. ఆమె లక్ష్యం వో చక్కని కవిత రాయటం. అయితే వోరోజు సాయంత్రం ఆమె ఓ దృశ్యాన్ని చూసింది. పోకిరీల వేదింపులు భరించలేని ఒక అమ్మాయి చనిపోతే వాళ్లమ్మ ఏడుస్తున్న హృదయవిదారక ఘటనని చూసి కుమిలి పోయింది. అదేరోజు ఆమెకి ఇంకో గుండె పగిలే విషయమూ తెలిసింది… ఆగ్నస్ అనే ఆ టీనేజర్ చనిపోవటానికి కారకుల్లో తన మనవడూ ఉన్నాడని తెలిసింది.

అన్నిటికీ మించిన విషయమేమిటంటే….. తన మనవడూ అతని స్నేహితులూ కలిసి ఆమెను వేధించారు, వారి బాధ తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోయింది. దానికి ప్రతిగా ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ అమ్మాయి తల్లికి డబ్బులిచ్చి పరిహారం చేసుకుందామనుకుంటున్నారు. అంటే.. తమ పిల్లలని కేసునుంచి తప్పించాలనుకుంటున్నారు. ఆగ్నస్ తల్లిని ఒప్పించటానికి ఈ అరవయ్యేళ్ల వృద్దురాలిని పంపించారు.
ఆ ముసలామె వెళ్లింది, ఆ అమ్మాయి తల్లితో మాట్లాడింది… కానీ, అది పరిహారం విషయమో, కేసు కాంప్రమైజ్ విషయమో కాదు. కేవలం ఒక తల్లి బాధను అర్థం చేసుకున్న మనిషిగా మాత్రమే మాట్లాడి వచ్చేసింది. నేరం చేసిన పిల్లలకంటే, ఆ నేరాన్ని కప్పి పుచ్చాలనుకునే వాళ్ల తల్లిదండ్రులంటే ఆమెకి అసహ్యం వేసింది. అందుకే ఆమె ఆగ్నస్ తల్లికి తానెవరో చెప్పకుండానే ఆమె దుఃఖాన్ని పంచుకొని, ఆమెని ఓదార్చి వచ్చింది.

ఆ తర్వాతి రోజు ఆమె వెళ్లే పొయెట్రీ వర్క్‌షాప్‌లో ట్రైనర్ అందరినీ అడిగాడు. “మీలో ఎవరెవరు కవిత రాశారు?” సమాధానం లేదు. అన్ని రోజుల క్లాసుల తరవాత కూడా ఎవ్వరూ ఒక కవిత రాయలేకపోయారు. అయితే! అతని టేబుల్ మీద ఒక ఫ్లవర్ బొకే, ఒక కాగితం ఉంది…. దానిమీద ఒక కవిత కూడా ఉంది. అది చనిపోయిన ఆగ్నస్ ని పిలుస్తూ రాసిన కవిత. “ఈ పాట ఆగ్నస్ కోసం” అంటూ రాసిన కవిత. ఆ కవితని ఎవరు రాశారో చెప్పే అవసరం లేదు కదూ..! కవిత్వం ఎలా పుడుతుందో చెప్పటం ఉద్దేశంగా కనిపించినా… ఇది ప్రపంచపు స్త్రీ దుఃఖాన్ని చూపించిన సినిమా.