రైతుల శ్రమతో రాజకీయం సిగ్గుచేటు: తెలంగాణా గవర్నమెంట్‌పై రాహుల్ గాంధీ తెలుగు ట్వీట్
తెలంగాణ రైతు సమస్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఖరిపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ.. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు అన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వార్ సాగుతోంది. ముఖ్యమంత్రితో పాటు టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారూ. కేంద్రం మాత్రం నిబంధనలకు తగ్గట్లే అన్ని రాష్ట్రాల్లోనూ కొనుగోళ్లు జరుగుతాయని, తెలంగాణ అందుకు మినహాయింపు ఏమాత్రం కాదని చెబుతోంది. ఇలా విమర్శలూ, ప్రతివిమర్శలూ జరుగుతూనే ఉన్నాయి.
ఇదే సమయంలో..‘తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ అఫీషియల్ ట్విటర్ పేజీ నుంచి తెలుగులో పోస్ట్ చేయటం గమనార్హం.