మాకు విస్తృతమైన ఆయుధ సాయం కావాలి : వోలోడిమిర్ జెలెన్స్కీ
ఉక్రెయిన్‌పై గత నెల 24న ప్రారంభమైన రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది.. మిసైళ్లు, బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్‌కు అపారనష్టం జరిగింది. ఉక్రెయిన్ పౌరులు ప్రాణభయంతో వలస బాట పట్టారు. ఇప్పటి వరకూ దాదాపు కోటి మంది తమ నివాసాలను వదిలి వెళ్లి ఉంటారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

ఇప్పటి వరకు 35 లక్షల మంది దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది. దేశంలోనే చెల్లాచెదురైన వాళ్లు 65 లక్షల మంది ఉన్నారు. ఇక అందమైన నగరాలు బాంబుల దాడికి మొండిగోడలుగా మారాయి. సుమారు 8 లక్షల 42 వేల కోట్లు ఉక్రెయిన్ కు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఉక్రెయిన్ లో 691 మంది పౌరులు చనిపోయారు. గాయపడ్డ వారు వేల సంఖ్యలో ఉన్నారు. మరియుపోల్ నగరంలో ఉన్న షాపులను నేలకూల్చారు, కొన్నింటిని తగలబెట్టారు.

అయినా సరే.. కూలిన మార్కెట్ శిథిలాల్లో ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని వెతుక్కుంటున్నారు మరియుపోల్ జనాలు. గోడౌన్లలో మిగిలిపోయి ఉన్న సరుకులను తెచ్చుకుని అరకొరగా కడుపు నింపుకుంటున్నారు. ఒకప్పుడు దర్జాగా, సంతోషంగా బతికిన ఈ తీరప్రాంత ప్రజలు. ఇప్పుడు నిలువ నీడలేని మహానగరంలో, ఒక్క బ్రెడ్ ముక్క కోసం పడిగాపులు పడుతూ బతుకీడుస్తున్నారు.

ఇదిలా ఉంటే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్‌పై రష్యా రసాయన దాడులకు దిగుతోందని. తమ పౌరులపై ఫాస్ఫరస్ బాంబులను ప్రయోగిస్తోందనీ, అందువల్ల తమకు విస్తృత ఆయుధ సాయాన్ని అందించాలని నాటోని కోరాడు.
నాటో సదస్సులో ఆయన మాట్లాడుతూ..మీ యుద్ధ విమానాల్లో ఒక శాతం మాకు ఇవ్వండి. మీ ట్యాంకులలో ఒక శాతం ఇవ్వడం అని కోరారు. అంతేగాక రష్యా తమ దేశంలో ఫాస్ఫరస్ ఆయుధాలతో మోహరించిందని చెప్పారు. రష్యన్ దాడులను ఎదుర్కొనేలా దురాక్రమణకు గురికాకుండా తమ దేశాన్ని రక్షించుకునేందుకు అవసరమైన ఆయుధ సాయాన్ని అందించి ఉక్రెనియన్ల మరణాన్ని నిరోధించాలని నాటోకి విజ్ఞప్తి చేశాడు.