నటుడు విల్‌స్మిత్‌పై పదేళ్ల బ్యాన్
ఆపుకోలేని ఆగ్రహం విల్ స్మిత్ మీద గట్టిదెబ్బ వేసింది. తన భార్య ని అవమానించినందుకు ఆమె గౌరవం కోసం సహ నటుడు క్రిస్‌రాక్‌ని చెంపదెబ్బ కొట్టినందుకు ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.
పదేళ్లపాటు ఆస్కార్ వేడుకల్లో పాల్గొనకుండా మోషన్ పిక్చర్ అకాడమీ ఆయనపై బ్యాన్ విధించింది. ఇతర అకాడమీ పురస్కారాల వేడుకల్లోనూ పాల్గొనకుండా పదేళ్లపాటు నిషేధం విధించారు.
‘శుక్రవారం సమావేశమైన బోర్డు అకాడమీ గవర్నర్లు 10 సంవత్సరాల పాటు (8 ఏప్రిల్ 2022 నుంచి) ఆస్కార్ వేడుకలకు మాత్రమే కాకుండా. అకాడమీ నిర్వహించే ఏ అవార్డు వేడుకల్లో పాల్గొనకూడదంటూ స్మిత్‌పై నిషేధం విధించారు’ అని అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రుబిన్, సిఇఒ డాన్ హడ్సన్ పేర్కొన్నారు.
94వ ఆస్కార్ వేడుకలో నటుడు క్రిస్‌రాక్ మీద విల్‌స్మిత్ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ ను నవ్వించే క్రమంలో క్రిస్ రాక్.. విల్ స్మిత్ భార్యని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు.

స్మిత్ భార్య ‘జాడా పింకెట్’కు ఉన్న వ్యాధిని ఉద్దేశించి అతడు జోక్ చేశాడు. ఈ విషయంలో హర్ట్ అయిన విల్ స్మిత్. స్టేజ్ పైకి వెళ్లి క్రిస్రాక్ను చెంపదెబ్బ కొట్టాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో కొందరు విల్ స్మిత్ ని సపోర్ట్ చేయగా.. మరికొందరు మాత్రం ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాల్సింది అంటూ కామెంట్స్ చేశారు.
తనను 10 ఏళ్ల పాటు నిషేధించడంపై విల్ స్మిత్ స్పందించారు. అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. స్మిత్ ఇప్పటికే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.